Balabhadrapuram Cancer Cases Mystery : తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామాన్ని కర్కశ క్యాన్సర్ కబళిస్తోంది. క్యాన్సర్ తీవ్రతకు కారణాలపై నిశితంగా అధ్యయనం చేయకుండానే జాతీయ, అంతర్జాతీయ సగటుతో పోలుస్తూ ఇక్కడ కేసులు తక్కువేనని సమస్యకు ముగింపు పలికేందుకు అధికారులు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో బలభద్రపురంలోనే సమస్య తీవ్రంగా ఉండటంపై ప్రభుత్వ శాఖల వద్ద సరైన సమాధానం లేదు.
స్థానికులు చెబుతున్న బాధితుల లెక్కలకు, అధికార గణాంకాలకు పోలిక లేదు. తొలుత 6, తర్వాత 23, ఆ తర్వాత 32 కేసులంటూ అధికారులు నెట్టుకొచ్చారు. గ్రామంలో 62 క్యాన్సర్ కేసులుండగా వీరిలో 25 మంది మరణించారు. 16 మందికి చికిత్స పూర్తయితే 21 మంది చికిత్స పొందుతున్నట్లు తేల్చారు. తాజా స్క్రీనింగ్‌లో గుర్తించిన 38 అనుమానిత కేసుల్లో క్యాన్సర్ బాధితులు ఎందరో స్పష్టత రావాల్సి ఉంది.
కాలుష్యమే కారణమా? : బలభద్రపురంలో క్యాన్సర్ విజృంభణకు పరిశ్రమల కాలుష్యమే కారణమనేది ప్రధాన ఆరోపణ. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితోపాటు స్థానికులు ఇదే వాదన వినిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కనీస చర్యల్లేక సమస్య తీవ్రత పెరిగింది. క్యాన్సర్ సోకితే లక్షణాలు వెంటనే బయటపడవన్నది నిపుణుల అభిప్రాయం. 16 ఏళ్ల కిందట బలభద్రపురంలో ఏర్పాటైన కేపీఆర్ ఎరువులు, పురుగు మందుల పరిశ్రమతో భూగర్భజలాలు కలుషితమయ్యాయని ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని నల్లమిల్లిలోనూ ఇదే సంస్థకు చెందిన మరో పరిశ్రమ ఉంది.
అక్కడా కాలుష్య ప్రభావంపై దృష్టి సారించాల్సి ఉంది. కేపీఆర్ సంస్థ బలభద్రపురంలోనే మరోచోట వేరే పరిశ్రమను ఏర్పాటు చేసుకుంది. దాని అవసరాలకు చేపట్టిన పవర్‌ప్లాంట్ పనులు స్థానికుల ప్రతిఘటనతో ముందుకు కదల్లేదు. ఈ పరిశ్రమ 2019లో కేపీఆర్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్‌కు బదిలీ అయింది. అది ప్రస్తుతం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ పరిశ్రమకు కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్, క్లోరిన్ డెరివేటెడ్ కెమికల్స్, క్లోరోమిథేన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, క్లోరోఫ్లోరోకార్బన్ ఉత్పత్తికి అనుమతులున్నాయి. ఈ ప్లాంట్ల కాలుష్య ప్రభావంపైనా చర్చ సాగుతోంది.
బలభద్రపురంలో తేలిన క్యాన్సర్ లెక్కలు - ఎంతంటే?
సమస్య తీవ్రత తగ్గిస్తున్నారా ? : గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పర్యావరణ అనుమతులకు 2022 మార్చి నుంచి మే వరకు అధ్యయనం చేశారు. అప్పట్లో పది స్టేషన్లలో 24 గంటల గాలి నాణ్యతను పరిశీలిస్తే పీఎం 10 గాఢత 45.3 నుంచి 81.7 మధ్య ఉంది. పీఎం 2.5 గాఢత 29.4 నుంచి 49.2 మధ్య ఉంది. ఎస్‌వో2- 5.2 నుంచి 12.1 మధ్య ఉంది. ఎన్‌వో2.. 10.2 నుంచి 25.3 మధ్య, సీవో 0.82 నమోదయ్యింది. తాజా పీసీబీ లెక్కలు మునుపటికంటే సమస్య తక్కువ ఉన్నట్లు చూపుతున్నాయి.
- స్థానిక పరిశ్రమలు రివర్స్ పంపింగ్‌తో వ్యర్థజలాలను భూమిలోకి మళ్లీ పంపడంవల్లే భూగర్భజలాలు కలుషితమవుతున్నాయనేది స్థానికుల ఆరోపణ. మరోవైపు వ్యర్థాలు, వ్యర్థ జలాల నిర్వహణ నిబంధనల ప్రకారమే సాగుతోందని పీసీబీ అధికారులు చెబుతున్నారు.
- పరిశ్రమల కాలుష్యంలోనూ క్యాన్సర్ కారకాలు ఉంటాయని పీఎం 10, పీఎం 2.5లాంటి పరీక్షలే కాకుండా నిష్ణాతులతో ప్రత్యేక అధ్యయనం చేయించాలనే సూచనలు వస్తున్నాయి. పరిశ్రమల అవసరాల కోసం నీళ్లను బోర్ల ద్వారా ఎక్కువగా తోడుతున్నందున భూగర్భజలాల గమనం, కాలుష్య ప్రభావం తెలుసుకోడానికి హైడ్రాలజికల్ మ్యాపింగ్ చేయించాలన్న వాదన ఉంది.
- భూగర్భజలాల్లో ఏ తరహా పురుగు మందుల అవశేషాలున్నాయో విశ్లేషించాల్సి ఉంది. ఇటీవల నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (నీరీ) బృందం బలభద్రపురంలో పర్యటించి నమూనాలు సేకరించింది. ఈ వివరాలూ వెల్లడైతే వాస్తవ పరిస్థితిపై స్పష్టత రానుంది. ప్రపంచ సగటుతో పోల్చి ఇక్కడి పరిస్థితిని తక్కువగా చూపడం సరికాదని ‘ప్రజలకోసం శాస్త్రవేత్తల’ ప్రతినిధి, విశ్రాంత చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కె.బాబూరావు పేర్కొన్నారు.
32 మంది క్యాన్సర్ బాధితులు - 38 మంది అనుమానితులు - బలభద్రపురంలో కొనసాగుతున్న వైద్యపరీక్షలు