Driver Growing Plants on Auto Roof : సాధారణంగా ఆకు పచ్చని మొక్కలను ఇంటి పెరట్లోనూ, మేడపైన పెంచుతుండటం చూస్తుంటాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా ఆటోపై మట్టికుండీలు అమర్చి వాటిపై మొక్కలు పెంచుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు ఓ ఆటోవాలా. అంతే కాదండోయ్ పర్యావరణం పట్ల తన ఆటోలో ప్రయాణించేవారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అలా ఆటోపై మొక్కలను పెంచడం వెనుక ఉద్దేశం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటోకు ఇరువైపులా మొక్కలు పెంచుతూ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన అంజి అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా పనిచేస్తు తన బతుకుబండిని నడుపుతున్నారు. ఆయన గత మూడేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్నారు. ఇందుకోసం తన ఆటోపై, ఇరువైపులా మట్టి కుండీలను అమర్చుకొని అందులో మొక్కలను పెంచుతుండటంతో అవి పెరిగి చిన్నపాటి వనాన్ని తలపిస్తోంది. ఏటా వేసవి సీజన్లో మూడు నెలల పాటు తన ఆటోలో రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ పర్యావరణ పరిరక్షణపై ప్రచారం చేస్తున్నారు.
మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరిస్తూ : అందరూ మొక్కలను నాటి సంరక్షించాలని ప్రజలకు ఈ ఆటోవాలా అవగాహన కల్పిస్తున్నారు. శుక్రవారం రోజు మహబూబాబాద్ నుంచి జనగామ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తూ జనగామలో ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. తన ఆటోలో ప్రయాణించే వారికి చల్లని నీరందిస్తున్నానని, మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరిస్తున్నానని వివరించారు. నా వల్ల ఏం అవుతుందిలే అనుకోకుండా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ఆ ఆటోడ్రైవర్ ప్రయత్నాన్ని మనమంతా అభినందిద్దాం.
ఆటో డ్రైవర్ గొప్ప మనసు - అలాంటి వారి కోసం నగరంలో ఉచితంగా మంచి నీటి పంపిణీ