Rajiv Swagruha Flats Auction : రాజీవ్ స్వగృహ(జలజ టౌన్‌షిప్) ఇళ్ల సముదాయ అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి సిద్ధం అవుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓసారి ఈ-వేలం నిర్వహించారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. తర్వాత మరోసారి అమ్మేందుకు ఏర్పాట్లు చేసి విరమించుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణలో భాగంగా రాజీవ్ స్వగృహ సముదాయ విక్రయానికి తెరపైకి తీసుకొచ్చింది.
రాజీవ్ స్వగృహకు శ్రీకారం : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు చేపట్టిన రాజీవ్ గృహకల్ప పథకం విజయవంతం అవటంతో 2008 సంవత్సరంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారం చేయటానికి సిద్ధపడింది. ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు రాజీవ్ స్వగృహ పథకానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లాలో రాజీవ్ స్వగృహ సముదాయ నిర్మాణానికి ఖమ్మం గ్రామీణ మండలాన్ని ఎంచుకుంది. పోలేపల్లి రెవెన్యూ పరిధిలోని మున్నేరు ఒడ్డున 12.30 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. అది సరిపోకపోవటంతో 3.24 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించింది. తొలి విడతగా 9.18 ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు మొదలుపెట్టింది.
మళ్లీ బ్లాక్‌లుగానే అమ్మకాలు : ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జలజ టౌన్‌షిప్‌ను బ్లాకులుగా అమ్మాలని ఆలోచన చేస్తోంది. బ్లాకులుగా కాకుండా ఫ్లాట్లుగా అమ్మకాలు చేపడితే మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు కొనేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో టీఎన్జీఓస్ సంఘం తరఫున ఉద్యోగులు ఈ సముదాయాన్ని ఫ్లాట్లుగా కొనేందుకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. అయినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాకులుగా అమ్మెందుకు ఆసక్తి చూపి ఫెయిల్ అయింది.
ఎనిమిది బ్లాకులు, తొమ్మిది ఫ్లోర్లు : 8 బ్లాకుల్లో తొమ్మిది చొప్పున ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోర్‌కు 8 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం మీద 576 ఫ్లాట్లు ఉన్నాయి. నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఇంటీరియల్ డెకరేషన్ చేయాల్సి ఉంది. తదనంతర రాజకీయ మార్పుల వల్ల పనులు ఆగిపోయాయి. రెండో విడతలో ఫ్లాట్ల కట్టడం కోసం కేటాయించిన 6.36 ఎకరాల భూమి ఖాళీగా ఉంది.
విక్రయానికి 2 సార్లు ప్రయత్నాలు : రాజీవ్ స్వగృహ సముదాయాన్ని అమ్మించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకి అప్పగించింది. హెచ్‌ఎండీఏ అధికారులు రాజీవ్ స్వగృహను జలజ టౌన్‌షిప్‌గా పేరు మార్చి అమ్మేందుకు 2 సార్లు ప్రయత్నం చేశారు. 2020 సంవత్సరంలో బహిరంగ వేలం ద్వారా ఫ్లాట్లను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని అనుకున్నారు. కొవిడ్ పరిస్థితుల వల్ల ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. 2022 సంవత్సరం మార్చి 24న ఆన్‌లైన్‌లో బ్లాక్‌ల వారీగా ఫ్లాట్లను అమ్మేందుకు వేలం నిర్వహించారు. కానీ ఎవరూ ముందుకురాలేదు.
రెండో విడత ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన 6.36 ఎకరాల ఖాళీ స్థలాన్ని విక్రయించేందుకు 2022 సంవత్సరం అక్టోబర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. పటాలు, సర్వేలు సిద్ధం చేసినా వేలం పాటను తాత్కాలికంగా వాయిదా వేసింది.
రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు స్థలాల వేలం - నోటిఫికేషన్ ఎప్పుడంటే?
రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలానికి కసరత్తు - ఈనెల 20వ తేదీన నోటిఫికేషన్!