ASI Ramchandar Suspended : భూభారతి సదస్సులో తన భూ సమస్యను చెప్పుకోవడానికి వెళ్లిన వృద్ధ రైతును ఓ పోలీసు అధికారి బయటకు గెంటేసిన సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన అల్లెపు వెంకటి అనే వృద్ధుడు తనకున్న వ్యవసాయ భూమిలో అరెకరం భూమి ఇతరులకు పట్టా అయిందని తన సమస్యను తహసిల్దార్ సుజాతకు విన్నవించేందుకు కౌంటర్లను దాటుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో వారు రైతును బయటకు పంపాలని పోలీసులకు తెలిపారు.
అక్కడే ఉన్న ఏఎస్ఐ రామ్ చందర్ అక్కడికి చేరుకొని రైతుతో దురుసుగా ప్రవర్తించి బైటకు గెంటివేశాడు. ఈ ఘటన వివాదంగా మారింది. సోషల్ మీడియోలో వైరల్‌గా మారిన వీడియో మంత్రి సీతక్క దృషికి వెళ్లింది. నిర్మల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆరాతీయడంతో దీనిపై విచారణ చేపట్టామని, ఏఎస్ఐ రాంచందర్‌ను డీఐజీ సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
"భూభారతి సదస్సులో ఎమ్మార్వోతో రైతు ఆర్గుమెంట్ చేశారు. దీంతో రైతును బయటకు పంపించాలని పోలీసులకు చెప్పారు. రైతును బయటకు పంపించే క్రమంలో ఏఎస్ఐ రామ్ చందర్ దురుసుగా నెట్టివేయడం జరిగింది.దీంతో ఎస్ఐను సస్పెండ్ చేయడం జరిగింది."- జానకి షర్మిల, నిర్మల జిల్లా ఎస్పీ
సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల
— Harish Rao Thanneeru (@BRSHarish) June 4, 2025
ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?
ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన @revanth_anumula ?
సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా?
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు?
నేడు ఖానాపూర్… pic.twitter.com/5VsvKDfZSP
రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ : రైతు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా అని ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ప్రజా పాలన ఇదేనా, సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారని, నేడు ఖానాపూర్‌లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారని ఆక్షేపించారు. ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.