Artificial Limbs For Dogs in Visakha : విశాఖ మెడ్‌టెక్ జోన్ మరో ఘనత సొంతం చేసుకుంది. పెంపుడు జంతువులు ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోతే వాటికి తిరిగి కొత్త జీవితం ప్రసాదిస్తోంది. మెడ్‌టెక్ జోన్ కృత్రిమ అవయవాల విభాగంలో వాటికి కృత్రిమ కాలు అమర్చుతోంది. తాజాగా భైరవ అనే శునకానికి ఆర్టిఫిషియల్ లింబ్‌ను అమర్చి కొత్త చరిత్ర లిఖించింది. శునకం ఓ ప్రమాదంలో ఒక కాలు కోల్పొయింది. దానికి ఆర్టిఫిషియల్ లింబ్ అమర్చాలని శునకం యజమాని మెడ్‌టెక్ జోన్‌లోని కృత్రిమ అవయవాల విభాగాన్ని అభ్యర్థించారు.
ఇప్పటికే మనుషులకు మెడ్‌టెక్ జోన్ ఆర్టిఫిషియల్ లింబ్ విభాగం కృత్రిమ అవయవాలను తయారుచేసి అమరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ లింబ్ విభాగం నిపుణులు తాజాగా శునకం కోసం కృత్రిమ కాలు తయారు చేశారు. దీనిని భైరవ అనే శునకానికి అమర్చి పరీక్షలు కూడా నిర్వహించారు. అన్నింట్లోనూ సంతృప్తికరమైన ఫలితాలు రావడంతో దానిని శాశ్వతంగా ఆ శునకానికి అమర్చారు. మెడ్‌టెక్ జోన్ ఆర్టిఫిషియల్ లింబ్ విభాగం సాధించిన ఈ ఘనత వల్ల పెంపుడు జంతువులకు ఏదైనా ప్రమాదంలో అవయవాలు విరిగిపోతే వాటిని కృత్రిమంగా అమర్చవచ్చు.
Visakhapatnam Medtech Zone : అవయవాలు కోల్పోయిన పెంపుడు జంతువులు నడిచేందుకు, కదలడానికి కృత్రిమ అవయవాలు ఎంతగానే సహాయపడుతాయి. మెడ్‌టెక్ జోన్లో అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ కాలు వల్ల శునకాలు కేవలం నడవడమే కాకుండా పరిగెత్తగలవని ఆర్టిఫిషియల్ లింబ్ విభాగం వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్ విభాగానికి తీసుకువచ్చే పెంపుడు జంతువులను వైద్యులు, నిపుణులు పరీక్షించి, అవసరమైన మేర పరికరాలు రూపొందిస్తారు.
'ఏదైనా జంతువులకు ప్రమాదం జరిగితే వాటికి ఈ కృత్రిమ అవయవాలు పెట్టడం వలన అవి ఎటువంటి ఇబ్బంది ఫీల్ అవ్వవు. ఇవి ప్రత్యేకంగా మెడ్ టెక్ జోన్లోనే తయారు చేయడం జరుగుతుంది. వీటి వలన ఇవి ఇతర శునకాలతో సంతోషంగా ఉండటానికి వీలవుతుంది'. - డాక్టర్ అవినాష్, శస్త్ర చికిత్స నిపుణులు
ప్రాణాలకు తెగించి యజమానులను కాపాడే కుక్కలు - టాప్ 10 మేలు జాతులివే!