Artificial Intelligence Advice for Police: రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన రిపోర్టులు రూపొందించడం పోలీసులకు భారంగా మారుతోంది. ఛార్జిషీటు దాఖలు, కోర్టులకు నివేదికల సమర్పణ కత్తిమీద సాములా మారుతోంది. దీంతో పని ఒత్తిడితో నేర విచారణలో పోలీసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు ఏఐ సాయంతో ముందుకెళ్తున్నారు. ఫిర్యాదుల నమోదు, నేర విచారణకు సంబంధించిన రిపోర్టుల తయారీలో కృత్రిమ మేధ (AI)ను సమర్థవంతంగా వినియోగిస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను తమకు కావాల్సిన రీతిలో ఉపయోగించుకుంటూ నేర విచారణలో వేగం పెంచుతున్నారు. గతంతో పోలిస్తే కేసుల డ్రాఫ్టింగ్‌లో తప్పులు 90%కి పైగా తగ్గడంతో పాటు కచ్చితత్వం పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. సమయం ఆదాతో పాటు మంచి ఫలితాలు వస్తుండటంతో కిందిస్థాయి సిబ్బందికి AIపై అవగాహన కల్పిస్తున్నారు.
సెక్షన్లు కూడా చెప్పేస్తోంది: ఫిర్యాదులో పేర్కొన్న అంశాల ఆధారంగా ఏయే సెక్షన్లను చేర్చాలో ఏఐ సూచిస్తోంది. విచారణ తీరు, ఆధారాల సేకరణ వివరాలను ఒక క్రమపద్ధతిలో చెప్తోంది. దీని వలన విచారణ వేగవంతంగా చేసేందుకు వీలవుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితుల విచారణ సమయంలో అనువాదం సమస్య లేకుండా పూర్తి కచ్చితత్వంతో అవగాహన కలిగేలా ఏఐ సహకారం అందిస్తుంది.
తప్పులను సైతం చెప్తోంది: ఎఫ్‌ఐఆర్ నమోదు తర్వాత ఏ కోణంలో కేసును విచారించాలో ఏఐ సూచిస్తోంది. విచారణ అనంతరం పోలీసులు దాఖలు చేసే ఛార్జిషీటును ఏఐ పరిశీలించి, పలు సూచనలు చేస్తుంది. ఛార్జిషీటులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని చెప్పడంతో పాటు అదనపు సమాచారం అవసరమైతే పొందుపరచాలని చెబుతుంది. కోర్టులో వాదనల సమయంలోనూ ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి? డిఫెన్స్ లాయర్ నుంచి ఎలాంటి ప్రశ్నలు రావచ్చు? వంటి అంశాలను ఏఐ ముందుగానే అంచనా వేస్తుంది. సమర్థవంతంగా వాదనలు వినిపించేందుకు ఎలా రెడీ కావాలో సూచిస్తుంది. కోర్టులో ఏ సందర్భాల్లో ఎలా నడుచుకోవాలో సలహాలిస్తోంది.
చెప్పింది రాసేస్తుంది: ఫిర్యాదుల నమోదుకు సంబంధించి బాధితులు చెప్పే విషయాలను రాసుకోవడం, కంప్యూటర్‌లో రిజిస్టర్ చేసుకోవడం వంటిని కష్టంగా మారుతోంది. వీటిని సైతం ఏఐ సులభతరం చేసింది. బాధితులు సమస్యలు చెబుతుంటే అక్కడికక్కడే రికార్డ్ చేసి, ఫిర్యాదును రెడీ చేస్తోంది. వృద్ధులు, అక్షర జ్ఞానం లేనివారు, ఫిర్యాదులు రాయలేని వారికి ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ విధానంలో ప్రయోగాత్మకంగా ఇప్పటివరకు 54 FIRలు నమోదు చేశారు.
సమయం ఆదా అవుతోంది: నేర విచారణలో ఏఐను వినియోగించడంతో సమయం ఆదా అవుతోందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. రిపోర్టులు తయారీలో వేగంతో పాటు కచ్చితత్వం పెరుగుతుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్‌లో ఏఐని సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు త్వరలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు నమోదు చేసేందుకు ఏఐను వినియోగిస్తామని వెల్లడించారు.
వ్యవసాయానికి 'ఏఐ' సాయం - అధునాతన సాంకేతికతతో అన్నదాతలకు అండ
కొత్త ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చిన గూగుల్- ఇకపై రియల్-టైమ్ గైడ్‌గా మీ స్మార్ట్‌ఫోన్!