Vontimitta Brahmotsavam 2025 : ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజు వైభవంగా జరిగాయి. మోహినీ అలంకారంలోఉన్న రాములవారు మాఢ వీధుల్లో విహరిస్తూ జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వాహన సేవలో పాల్గొన్న భక్తులు పరవశానికి లోనయ్యారు. కర్పూర హారతులతో స్వామివారిని ప్రార్థించారు.
మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఏర్పాటు చేసిన రామాయణ కళాకృతుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. రాఘవుడు జన్మించినప్పటి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు ఉన్న ప్రధాన ఘట్టాలను అందంగా కళాకృతుల రూపంలో తీర్చిదిద్దారు. జానకిరాముల స్వయంవరం, సీతాపహరణ, రామసేతు నిర్మాణం, రావణాసురుడిని సంహరించడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కోదండరామస్వామి ఆలయం పక్కనే ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివస్తున్నారు.
Vontimitta Sita Rama kalyanam 2025 : ఒంటిమిట్ట రామాలయంలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో సమీక్ష నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోని 147 గ్యాలరీల్లో 60,000ల మంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్యాలరీలో పోలీసులు, పారామెడికల్, శ్రీవారి సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణ వేదిక వద్ద తలంబ్రాల పంపిణీకి తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు తలంబ్రాలు, కంకణం, లడ్డూ, అన్నప్రసాదాలు అందించనున్నారు.
అలాగే కాలినడకన వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. అదేవిధంగా షెడ్ల వద్ద చలివేంద్రం, పానకం, మజ్జిగ, కూలర్లు ఉండేలా చూస్తున్నామని తెలిపారు. ఆలయ సమీపంలో క్యూలైన్లలో వెళ్లే భక్తుల కోసం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. సీతారాముల కల్యాణోత్సవం వీక్షించేలా 23 ఎల్‌ఈడీ స్క్రీన్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 2,500 మంది పోలీసులు, 400 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఆలయ పరిసరాల్లో 7 డ్రోన్లు, 130 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని బీఆర్ నాయుడు వెల్లడించారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒంటిమిట్ట రామయ్య క్షేత్రం
11న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం - భక్తులకు 70 వేల తిరుమల లడ్డూలు