Arcelormittal Steel Captive Port: అనకాపల్లి జిల్లా డీఎల్ పురం వద్ద వాటర్ ఫ్రంట్‌ను క్యాప్టివ్ పోర్టు నిర్మాణం కోసం ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్‌కు (ArcelorMittal Nippon Steel India Limited) కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.9 కిలో మీటర్ల వాటర్‌ఫ్రంట్ పొడవు ప్రాంతాన్ని పోర్టు నిర్మాణానికి అనుమతించింది. భారత నౌకాదళానికి చెందిన ఎన్‌ఏఓబీ (Naval Alternative Operating Base) రాంబిల్లి పోర్టు ఏర్పాటుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 3 నాటికల్ మైళ్ల బఫర్ జోన్‌కు వెలుపల ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
పోర్టు నిర్మాణానికి కేంద్ర రక్షణ, హోం, షిప్పింగ్ మంత్రిత్వ శాఖలతోపాటు ఇతర చట్టబద్ధమైన ఏజెన్సీల నుంచి అవసరమైన ఎన్‌ఓసీ/క్లియరెన్స్‌లను (No Objection Certificate) ఆర్సెలార్ మిత్తల్ సంస్థ పొందాలన్న నిబంధన విధించింది. పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వాణిజ్యాన్ని సులభతరం చేయడంతోపాటు పెట్టుబడులను ఆకర్షించడం, లాజిస్టిక్ సామర్థ్యం పెంచుకునేందుకు క్యాప్టివ్ పోర్టు అవసరం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనికోసం కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌తో (kakinada Gateway Port) కుదుర్చుకున్న రాయితీ ఒప్పందంలోని క్లాజ్ నంబరు 30.1.1లో కాంపిటేటివ్ పోర్టును ప్రారంభించడంపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం సవరించింది.
మొదటి దశలో 20 వేల మందికి ఉపాధి: కొన్ని నిబంధనలను ఆర్సెలార్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ సంస్థ పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆర్సెలార్ మిత్తల్ సంస్థ రెండు దశల్లో ఏటా 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును నెలకొల్పాలి. మొదటి దశలో 7.3 ఎంఎంటీపీఏ (Million Metric Tonnes Per Annum) ప్లాంటును 2029 నాటికి పూర్తి చేసి, 20 వేల మందికి ఉపాధి కల్పించాలి. ఏపీ మారిటైం బోర్డు నిర్దేశించిన ప్రకారం, ఆయా భూములకు లీజు చెల్లించి, ఆ మొత్తాన్ని నిబంధనల ప్రకారం తిరిగి క్లెయిమ్ చేసుకోవాలి. వాటర్ ఫ్రంట్ రాయల్టీ, ఇతర బకాయిలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్థకి స్పష్టం చేసింది.
కాగా దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్‌తో కలిసి సంయుక్తంగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, దానికి అనుబంధంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి సంబంధించి మిత్తల్ సంస్థ ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు అందించింది. ఈ సంస్థ 2 దశల్లో రూ.1,61,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 63 వేల మందికి ఉపాధి లభించనుంది.
విశాఖకు జీసీసీ! - పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రాష్ట్రానికి మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు - 9 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదముద్ర