Anakapalli ArcelorMittal Plant : ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్ జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్‌తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్(ఐఎస్‌పీ)కు బుధవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిసింది. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, దానికి అనుబంధంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి సంబంధించి మిత్తల్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. రెండు దశల్లో రూ.1,61,198 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు, 63,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది.
మొదటి దశలో రూ.70 వేల కోట్లు : మొదటి దశ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి నాలుగు సంవత్సరాల్లో రూ.70వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో తెలిపింది. 7.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామంది. దీని ద్వారా 20వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. మొదటి దశ పనులను 2029 జనవరికి పూర్తి చేయనున్నట్లు వివరించింది.
సంస్థ అందించిన ప్రీ-ఫీజిబులిటీ రిపోర్ట్ ఆధారంగా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీకి చెందిన 2164.31 ఎకరాల భూములను సర్కార్ గుర్తించింది. బుచ్చయ్యపేటలో 102.18 ఎకరాలు, చందనాడలో 840.2 ఎకరాలు, డీఎల్ పురంలో 674.39 ఎకరాలు, రాజయ్యపేటలో 36.62 ఎకరాలు, వేంపాడులో 510.92 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
- రెండో దశలో రూ.80వేల కోట్లతో ఉక్కు కర్మాగారం పనులు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో వివరించింది. దీని ద్వారా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 24 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని పేర్కొంది. ఈ పనులను 2033 నాటికి పూర్తి చేయనున్నట్లు, మరో 35వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించింది.
- దేశీయ ఉక్కు ఉత్పత్తిలో 20 శాతం వాటాను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో సంస్థ తెలిపింది. 2035 నాటికి 40 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఏటా 9.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటును ఎస్సార్ స్టీల్స్ నుంచి కొన్నామని చెప్పింది. ఏటా మరో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంగా కొత్త పరిశ్రమ ఏర్పాటుకు తలపెట్టినట్లు వివరించింది. అందుకు అనుగుణంగా వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగా దేశంలోని తూర్పు తీరంలో కో-టెర్మినస్ పోర్టు ఆధారిత క్లస్టర్‌తో ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించామంది. నక్కపల్లి దగ్గర అవసరమైనవి అందుబాటులో ఉండటం కలిసొస్తుందని ప్రతిపాదనల్లో వెల్లడించింది.
పోర్టు అభివృద్ధికి రూ.11,198 కోట్లు : మిత్తల్ సంస్థ రెండు దశల్లో రూ.11,198 కోట్లను ఉక్కు కర్మాగారానికి అనుసంధానంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్టు అభివృద్ధికి వెచ్చించనుంది. తొలి దశ పోర్టు నిర్మాణానికి రూ.5,816 కోట్లను ఖర్చు చేయనున్నట్లు, దీని ద్వారా 3,000ల మందికి ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొంది. మొదటి దశలో 5 బెర్తులు అభివృద్ధి చేయనున్నట్లు, వాటి పొడవు 1.5 కిలోమీటర్లుగా తెలిపింది. దీని ద్వారా ఏటా 20.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు నిర్వహిస్తామని పోర్టు నిర్మాణానికి 150 ఎకరాలను కేటాయించాలని సంస్థ ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో వివరించింది.
రెండోదశలో పోర్టు విస్తరణకు రూ.5,382 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. మరో 12 బెర్తులను నిర్మించనున్నట్లు, అందుకోసం 170 ఎకరాలు కేటాయించాలని విన్నవించింది. ఏటా అదనంగా 28.99 మిలియన్ టన్నుల ఉత్పత్తుల రవాణా సామర్థ్యం ఏర్పడుతుందని, ఈ దశలో అదనంగా మరో 5,000ల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పింది.
ఉత్తరాంధ్రకు మరో మణిహారం - అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్!
ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ - పెట్టుబడులపై నేడు కీలక ప్రకటన?