Aqua Farmers Facing Losses Due To Weather Conditions: భారం నుంచి కాస్త ఉపశమనం లభించిందని సంతోషిస్తున్న ఆక్వా రైతులకు భిన్న వాతావరణ పరిస్థితులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఓ వైపు మండే ఎండ గంటల వ్యవధిలోనే మబ్బులు పట్టి జల్లులు కురవడం, తీవ్ర ఉక్కపోతతో చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోతోంది. సమస్య తలెత్తిన చెరువుల్లో రొయ్యలు దెబ్బతింటున్నాయి. మిగిలిన వాటిని కాపాడుకోవాలన్న ఆశతో ఎప్పటికప్పుడు అనుకున్న కౌంట్ రాకుండానే పట్టుబడులు చేపెట్టి రైతులు నష్టపోతున్నారు.
వేసవిలో సాగు ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. మొదట్లో బాగానే ఉన్నప్పటికీ వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఆక్వా రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. భరించలేని ఉక్కపోతతో పాటు వర్షాలతో కొల్లేరు, ఉప్పుటేరు, సముద్ర తీర ప్రాంత మండలాల్లో రొయ్యలు, చేపల చెరువుల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
విపరీతమైన ఉక్కపోత, వర్షాలు: మధ్యాహ్నం వరకూ విపరీతంగా ఎండ, అంతలోనే మబ్బులు పట్టి వర్షం కురవడంతో చెరువుల్లోని ఆక్సిజన్ స్థాయిల్లో గణనీయంగా హెచ్చుతగ్గులు వస్తున్నాయి. దీంతో రొయ్యలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎంత ఎండ ఉన్నా ఏరియేటర్లతో రొయ్యలకు సరిపడా వాతావరణాన్ని కల్పించే రైతులు ఉక్కపోత వాతావరణం ఉంటే మాత్రం డీలా పడిపోతుతున్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వాతావరణలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ వైపు విపరీతమైన వేడి అంతలోనే చల్లదనం రొయ్యలను వణికిస్తోంది. రెండు, మూడు రోజుల పాటు అలాంటి పరిస్థితి ఉంటే రొయ్య మృత్యువాత పడుతుంది. అలాంటిది ఏకధాటిగా 20 రోజుల నుంచి వాతావరణం తేడాగా ఉండటంతో అనుకున్న కౌంట్ రాకపోయినా పట్టుబడి చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఓ వైపు వ్యాధులు, మరో వైపు వాతావరణ పరిస్థితులతో నష్టపోతున్నామని ఆవేదన వ్యకంచేస్తున్నారు.
విద్యుత్‌పై రాయితీ కల్పించాలి: చేతికొచ్చిన రొయ్యలు వాతావరణ మార్పుల కారణంగా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో రైతులు శ్రమిస్తున్నారు. చెరువుల్లో ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, ఏరియేటర్ల వినియోగానికి డీజిల్, ప్రోబయోటిక్స్, మినరల్స్ చల్లుతూ రొయ్యలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల కేవలం పది రోజుల వ్యవధిలోనే ఎకరానికి సగటున 15 వేలకు మించి అదనంగా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు.
గత ప్రభుత్వంలో గుదిబండగా మారిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం తగ్గిస్తే ఆక్వా రంగం కోలుకుంటుందని రైతులు చెబుతున్నారు. ఏరియేటర్లతో చేపలు, రొయ్యలను బతికించుకునేందుకు ప్రభుత్వం విద్యుత్ రాయితీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు.
''రెండు, మూడు రోజుల పాటు అలాంటి పరిస్థితి ఉంటే సరుకు మృత్యువాత పడుతుంది. అలాంటిది ఏకధాటిగా 20 రోజుల నుంచి వాతావరణం తేడాగా ఉండటంతో అనుకున్న కౌంట్ రాకపోయినా పట్టుబడి చేయాల్సి వస్తోంది. ఓ వైపు వ్యాధులు, మరో వైపు వాతావరణ పరిస్థితులతో నష్టపోతున్నాం. చెరువుల్లో ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, ఏరియేటర్ల వినియోగానికి డీజిల్, ప్రోబయోటిక్స్, మినరల్స్ చల్లుతూ రొయ్యలను బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలా కేవలం పది రోజుల వ్యవధిలోనే ఎకరానికి సగటున 15 వేలకు మించి అదనంగా ఖర్చు చేస్తున్నాం. విద్యుత్‌పై రాయితీ కల్పిస్తే మేము కోలుకునే అవకాశం ఉంటుంది''-ఆక్వా రైతులు