APSRTC Looking To Launch Another 600 Electric Buses: ఏపీఎస్‌ఆర్టీసీ మరో 600 విద్యుత్తు బస్సులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిని వివిధ నగరాల పరిధిలో, వాటి చుట్టుపక్కల ప్రాంతాలకు నడపాలని చూస్తోంది. ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా 14 వేల విద్యుత్తు బస్సులను వివిధ రాష్ట్రాల ఆర్టీసీలకు కేటాయిస్తోంది. ఇప్పటికే ఏపీలోని 11 నగరాలకు 750 బస్సులు కేటాయించింది. ఆర్టీసీ అదనంగా కేంద్రాన్ని కోరుతున్న వాటిలో 15 ఏళ్లు దాటినవి తుక్కుగా మార్చివేస్తే వాటి బదులు 300, కొత్తగా మరో 300 బస్సులు ఉన్నాయి.
అమరావతికి కేటాయించిన బస్సులను మంగళగిరి డిపోకు, విజయవాడవి విద్యాధరపురం, తిరుపతివి మంగళం డిపోలకు అందిస్తారు. విశాఖ విద్యుత్తు బస్సులు గాజువాక డిపోతోపాటు కొత్తగా ఏర్పాటుచేసే సింహపురి డిపోకు ఇవ్వనున్నారు. ఇందుకు సింహాచలం నుంచి వేపగుంట వెళ్లే మార్గంలో సింహపురి కాలనీ వద్ద 4 ఎకరాల స్థలంలో డిపో నిర్మించనున్నారు. డిపోల్లో విద్యుత్ బస్సుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్‌టీ లైన్ కోసం విద్యుత్తుశాఖకు ఆర్టీసీ అధికారులు దరఖాస్తు చేశారు. విద్యుత్తు లైన్ ఖర్చంతా కేంద్రమే భరించనుంది.
2 నెలల్లో బస్సులు వచ్చేలా ప్రణాళికలు: ఇప్పటికే కేటాయించిన బస్సుల్లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు నగరాల్లో వంద చొప్పున, అమరావతి, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, రాజమహేంద్రవరం, కాకినాడల్లో 50 చొప్పున నడపనున్నారు. వీటిని పుణెకు చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ సంస్థ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) విధానంలో నడపనుంది.
నిబంధనలు తప్పనిసరి: మొత్తం 750 బస్సులు ఉండగా 9 మీటర్ల పొడవు ఉండేవి 124 కాగా, మిగిలినవన్నీ 12 మీటర్ల పొడవు ఉన్నవే కావడం గమనార్హం. 12 ఏళ్ల వరకు గానీ, 10 లక్షల కి.మీ. వరకు గానీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ, గుత్తేదారు సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. 12 మీటర్ల బస్సుకు కి.మీ.కు రూ.72.55 చొప్పన, అదే 9 మీటర్ల బస్సుకు కి.మీ.కు రూ.62.12 చొప్పున కేంద్రం బస్సులకు ధరలను నిర్ణయించింది. ఇందులో కి.మీ.కు రూ.24 చొప్పున కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఆర్టీసీ చెల్లించవలసి ఉంటుంది. గుత్తేదారు సంస్థ 2 నెలల తర్వాత నుంచి ఈ బస్సులను వివిధ దశలవారీగా పలు నగరాల్లో ప్రవేశపెట్టనుంది.
అమరావతిలో టెర్మినల్స్, బస్టాండ్లపై ఆర్టీసీ ఫోకస్ - ప్రతిపాదనలు సిద్ధం
త్వరలోనే ఏపీకి 750 విద్యుత్ బస్సులు - అమరావతికి 50, విశాఖకు 100