Rain Alert in AP : ఏపీలో కొద్దిరోజులుగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి . ఉదయం పూట నెత్తిన నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఈ వేసవి చాలా హాట్ అన్న అంచనాలు నిజం చేస్తూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడిపోతోంది. ఉన్నట్టుండి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. చేతికి వచ్చిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ఈ క్రమంలో ఏపీలో రానున్న మూడు రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కిందకు వెళ్లి నిలబడకూదనని రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.
AP Weather Report : 15న (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.