APIIC Officials Provided Fake Bills in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ రహదారిలో ఏర్పడిన 40 గుంతలను పూడ్చి రూ.20 లక్షలు బిల్లులు చూపి నిధుల స్వాహాకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. హిందూపురం గ్రామీణ మండలం గోళ్లాపురం పారిశ్రామిక వాడలోని గోళ్లాపురం కూడలి నుంచి హెరిటేజ్ పరిశ్రమ వరకు రహదారిలో ఎక్కువ గుంతలు ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ పరిశీలనకు వస్తున్నారని యుద్ధ ప్రాతిపదికన ఈ మార్గంలో ఉన్న దాదాపు 40 గుంతలు పూడ్చివేశారు.
ఖర్చు రూ.5 లక్షలు, లెక్కలు రూ.20 లక్షలు : ఈ పనులు హడావిడిగా చేపట్టడం, నాసిరకంగా ఉండటంతో పక్షం రోజులకే రహదారి పాడైపోయింది. ఈ గుంతలు పూడ్చేందుకు ఇంత పెద్దఎత్తున నిధులు వ్యయం కాలేదని, దాదాపు రూ.5 లక్షలు వెచ్చించి ఉండవచ్చని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. అయితే ఏపీఐఐసీ అధికారులు రూ.20 లక్షలు వ్యయం అయినట్లు బిల్లులు మంజూరుకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు వాస్తవాలు విచారించి గుంతలు పూడ్చేందుకు వ్యయం చేసిన మొత్తం మంజూరు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతున్నారు.
కొంత మంది నాయకుల అండతో : నాసిరకంగా రహదారి గుంతలు పూడ్చడమే కాకుండా దీనికి తక్కువ వెచ్చించి అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్లు బిల్లులు ఏపీఐఐసీ అధికారులు ప్రతిపాదించిన విషయం వెలుగులోకి రావటంతో వారు అయోమయానికి గురైనట్లు తెలిసింది. అయితే తాము తక్కువ నిధులతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామని పనులు ఎవరు చేశారన్న విషయం తమకు తెలియదంటున్నారు. కొంతమంది నాయకులు వెనుక ఉండి వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలిసింది. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని చేసిన పనులకు మాత్రమే బిల్లులు మంజూరు చేయాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఐటీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ - కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు
రాష్ట్రంలో మెగా ఇండస్ట్రియల్ హబ్ - ప్రభుత్వానికి APIIC ప్రతిపాదనలు