APHMEL Company Facing Challenges: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లాభాల బాటలో సాగిన ఆంధ్రప్రదేశ్ భారీ యంత్ర ఇంజినీరింగ్ లిమిటెడ్ (Andhra Pradesh Heavy Machinery and Engineering Limited - APHMEL) అప్మెల్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఒకప్పుడు వెయ్యి మంది ఉద్యోగులు, 110 కోట్లకు పైగా టర్నోవర్‌తో కళకళలాడిన సంస్థ ఇప్పుడు దివాలా అంచున, దీనిస్థితికి చేరింది.
విజయవాడ శివార్లలో కొండపల్లి వద్ద ఉన్న అప్మెల్ తెలంగాణలోని సింగరేణి సంస్థ యాజమాన్యం కింద ఉండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ సంస్థ నలిగిపోతోంది. ఉద్యోగుల సంఖ్య నాలుగుఅంకెల నుంచి 99కు పడిపోయింది. ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఇప్పటికీ అవకాశాలు ఇస్తే సంస్థ అద్భుతాలు చేయగలదని, ఇంకొన్నాళ్లు ఇలాగే వదిలేస్తే మాత్రం మూతపడటం ఖాయమని ఉద్యోగులు, వాటాదారులు చెబుతున్నారు. సంస్థను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాజాగా లేఖ రాశారు.
కృష్ణా జిల్లాలో గ్రామీణులకు ఉపాధి అవకాశాల కల్పన, అనుబంధ పరిశ్రమల అభివృద్ధి, వాటాదారులకు లాభాలను అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ APIDC ఆధ్వర్యంలో అప్మెల్‌ను 1976లో కొండపల్లి వద్ద ఏర్పాటు చేశారు. భారీ యంత్ర సామగ్రి, విడిభాగాల తయారీ, సరఫరా, నిర్వహణ లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. బొగ్గు గనుల్లో ఉపయోగించే మ్యాన్‌రైడింగ్ కార్లు, చైర్ కార్లు, కన్వేయర్ బెల్ట్‌లు, చైన్ కన్వేయర్లు, పొక్లెయిన్ బకెట్లు, రూలర్లు, రూఫ్ బోల్ట్‌లు, క్రషింగ్, జంబో డ్రిల్ పరికరాల వంటి వాటికి సంబంధించిన 50కి పైగా విడిభాగాల తయారీ, మరమ్మతులు అప్మెల్‌లో చేస్తారు. భారీ కర్మాగారాల నుంచి సంస్థకు ఆర్డర్లు వచ్చేవి. 1994లో ప్రభుత్వం అప్మెల్‌ను సింగరేణికి అనుసంధానించింది. సింగరేణి నుంచి ఏటా కోట్ల రూపాయల్లో ఆర్డర్లు వచ్చేవి. రాష్ట్ర విభజన తర్వాత ఆ సంస్థ వర్క్ ఆర్డర్లు తగ్గిస్తూ వచ్చింది. 2020 తర్వాత దాదాపు పూర్తిగా ఆపేయడంతో అప్మెల్ ఖాయిలా పడే పరిస్థితికి చేరింది.
అప్మెల్‌కు కొండపల్లి వద్ద కనీసం 200 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 207 ఎకరాల భూములు ఉన్నాయి. ఇక్కడ నూతన పరిశ్రమలను నెలకొల్పి, విజయవాడ - హైదరాబాద్ ప్రధాన రైల్వే మార్గానికి కలుపుతూ ట్రాక్ ఏర్పాటు చేస్తే వేర్‌హౌస్, లాజిస్టిక్ హబ్‌గా వాడుకునేందుకు అనువుగా ఉంటుందని వాటాదారులు ప్రభుత్వానికి తాజాగా విన్నవించారు. రూఫ్‌టాప్ సౌర ప్యానళ్ల తయారీ కేంద్రం, 10 నుంచి 20 మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వారా ఆదాయ వృద్ధితోపాటు యువతకు భారీగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అప్మెల్‌ను ఏపీకి కేటాయించాలంటూ షీలాబేడీ కమిటీ సిఫార్సు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి వద్ద దస్త్రం పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి యాజమాన్యాన్ని ఏపీకి బదిలీ చేసి, సంస్థను పునరుద్ధరించేందుకు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబును వాటాదారులు కోరుతున్నారు.
"మొత్తం కంపెనీ భాగానే ఉంది. కొన్ని సంవత్సరాలు లాభాల్లో ఉంటుంది. కొన్ని సంవత్సరాలు నష్టాల్లో ఉంటుంది. స్థానికంగా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో కంపెనీ పెట్టారు. ఇవాళ కొత్తగా రిక్రూట్మెంట్ లేదు. ట్రైనింగ్ లేదు. ఏదో అలా కంపెనీని నడుపుతున్నారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లు కూడా పలు మార్లు మాట్లాడారు. కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు". - శేషగిరిరావు, అప్మెల్ డైరెక్టర్
‘టెస్లా’ కోసం భూములు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం - ఆ జిల్లాలో 500 ఎకరాలు పరిశీలన