Crowned For Miss And Mrs. Telugu USA : ఎల్లలు దాటిన మన తెలుగు వనితల ఘనత అది. భారత శిఖరాన మణిదీపమై మెరిసే ఆంధ్రా వనితల ‘అంద’మైన కల తీరిన క్షణమిది. అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ‘మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏగా కిరీట ధారణ చేసిన తెలుగమ్మాయిల అరుదైన విజయమది. తనువంతా నిలువెల్లా తెలుగుదనం ఉట్టిపడిన వేళ ఆంధ్రా ఆడ పడుచులు పల్లె సీమకు అందించిన అరుదైన కానుక ఇది.
విశ్వవిజేతగా నిలిచే రోజు కోసం : పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొత్తపల్లి రాంబాబు, వనజ దంపతుల పుత్రిక చూర్ణిక ప్రియకు సంప్రదాయాలపై ఎనలేని మక్కువ. ఆ ఇష్టంతోనే కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. నేటి తరానికి అనుగుణంగా శాస్త్రీయ నృత్యంపై పట్టు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో 200కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో పతకాలు, ప్రశంసలు దక్కించుకున్నారు.
బీటెక్ పూర్తి చేసి 9 నెలల కిందట ఎమ్మెస్ చదువు నిమిత్తం అమెరికాలోని ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ తెలుగు సంఘాల నేతృత్వాన డల్లాస్‌లో నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ పోటీలపై దృష్టి పెట్టారు. అందం, అణుకువ ఆదర్శ భావాలతో చూపరులను ఆకట్టుకునే చూర్ణిక ఆ పోటీల్లో రన్నర్‌గా నిలిచారు. ‘తెలుగు బిడ్డగా అమెరికా వేదికపై ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని, విశ్వవిజేతగా నిలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నానని చూర్ణిక ప్రియ చెప్పుకొచ్చారు.
మిసెస్ తెలుగు USA రన్నరప్‌గా గుడివాడ మహిళ
మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ : నూజివీడుకు చెందిన అట్లూరి కృష్ణప్రసాద్, శైలజ దంపతుల కుమార్తె మౌనిక బెంగళూరులో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. హైదరాబాద్‌లో జలవనరుల శాఖ ఏఈగా పని చేశారు. పదేళ్ల కిందట పరుచూరి జితేంద్రకుమార్‌తో వివాహం జరిగింది. అమెరికాలో ఉద్యోగం రావడంతో కుటుంబంతో కలిసి అక్కడ స్థిరపడ్డారు. విశ్వ సుందరి కావాలన్న లక్ష్యాన్ని మనసులోనే దాచుకున్న మౌనికకు ఓ అవకాశం తన ముందు నిలిచింది.
డల్లాస్‌లో మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ పోటీలు జరుగుతున్నాయన్న వార్త ఆమెలో ఉత్సాహాన్ని నింపింది. వెంటనే దరఖాస్తు చేశారు. తనపై తనకున్న నమ్మకంతో మౌనిక ముందడుగు వేశారు. గత నెల 26న జరిగిన పోటీల్లో ఆమె మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏలో ద్వితీయ స్థానం కైవశం చేసుకున్నారు. నూజివీడు నుంచి వచ్చి అమెరికాలో ఈ అరుదైన గౌరవం పొందడం చాలా గర్వంగా ఉందని, మన దేశపు వేదికపై ఇలాంటి విజయం సాధించాలనేది తన ఆకాంక్ష అని మౌనిక పేర్కొన్నారు.
మిస్ తెలుగు యూఎస్‌గా పోలవరం యువతి - టాలెంటెడ్ కేటగిరీలో ప్రథమస్థానం