AP Medical Council will Focus Specifically on Bogus MBBS Certificates : బోగస్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లపై ఏపీ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దృష్టి సారించనుంది. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ నూతన సభ్యులు చర్యలు చేపట్టనున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్, ఇంటర్న్‌షిప్ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
రాష్ట్రంలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్న వైద్యుల డేటాను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యులు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో సుమారు 70 వేల మంది వైద్యులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా వారంతా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారో పూర్తి వివరాలను ఏపీఎంసీ (APMC) సేకరించలేదు. సాధారణంగా వైద్యులు కౌన్సిల్‌లో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఐదేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. రెన్యూవల్ చేయాలంటే తప్పనిసరిగా 30 క్రెడెన్షియల్ పాయింట్లు వారికి రావాలి.
ఈ పాయింట్లను తెచ్చుకునేందుకు వైద్యులు, సెమినార్లకు హాజరుకావడం, వైద్యరంగంలో తాజాగా వస్తున్న చికిత్సా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే చాలా మంది వైద్యులు ఎంసీఐలో రిజిస్ట్రేషన్‌ను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనితో పాటు ఎంఐసీకి సవాలుగా మారుతున్న నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లపై నూతన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు దృష్టి పెట్టనున్నారు. బోగస్ సర్టిఫికెట్లు పెట్టినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు.
'శంకర్‌దాదా ఎంబీబీఎస్'లకు ఇక చెక్ - దేశ వ్యాప్తంగా వైద్యులకు యూనిక్ ఐడీ
'ఏపీఎంసీకి విదేశీ వైద్య విద్యార్థుల రిజిస్ట్రేషన్ సమస్య జటిలంగా మారింది. కోవిడ్ వేళ పలు దేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయలేదు. జాతీయ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం వైద్య విద్యార్థులకు ఏడాది నుంచి మూడేళ్ల వరకు హౌస్ సర్జన్‌గా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఐదేళ్లు ఎంబీబీఎస్ చదివి మరో మూడేళ్లు హౌస్ సర్జన్‌గా చేయాలంటే భవిష్యత్తు నాశనమవుతుందని విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేపడుతున్నారు. నిబంధనల మేరకు చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరిస్తాం.' -ఏపీఎంసీ నూతన సభ్యులు
ఏపీఎంసీ కౌన్సిల్ పనితీరును మెరుగుపరుస్తామని నూతన సభ్యులు చెబుతున్నారు. అవకతవకలకు తావు లేకుండా చూస్తామంటున్నారు.