AP High Court on Kakani Bail Petition : అక్రమ మైనింగ్ వ్యవహారంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై కేసును కొట్టేయాలని మరో వ్యాజ్యం వేశారు. సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీసుల తరపున పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరానికి పాల్పడ్డారని పీపీ లక్ష్మీనారాయణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకే పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ మైనింగ్ కేసులో ఎస్సీఎస్టీ చట్టంలోని సెక్షన్లను చేర్చామని వివరించారు. కాకాణి దర్యాప్తునకు సహకరించడం లేదని తెలిపారు. ఆయనకు నోటీసులు అందజేయడానికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా టన్నుల కొద్ది క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని ధర్మాసనానికి తెలియజేశారు.
Kakani Quartz Mining Case : ఈ మేరకు మైనింగ్ అధికారి బాలాజీనాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారని పీపీ లక్ష్మీనారాయణ తెలిపారు. దీని ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. రుస్తుం సంస్థ మైనింగ్ గడువు ముగిసి మూతపడినా ఆ ప్రాంతం నుంచి క్వార్ట్జ్ను తవ్వారని ధర్మాసనానికి వివరించారు. అనంతరం ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.
మరోవైపు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విషయం నెల్లూరు జిల్లా పోలీసులకు సవాల్‌గా మారింది. నెల్లూరులో ఉన్నప్పుడు ఆయణ్ని అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాక విచారణకు హాజరు కావాలని మూడుసార్లు నోటీసులిచ్చినా ఆయన హాజరు కాలేదు. మరోవైపు హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో కాకాణి ఫొటోలు పోస్టింగ్‌లు వస్తున్నాయి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్‌లోని ఇంటికి వెళ్లినా అక్కడ దొరకడం లేదు. కేసులకు భయపడను అంటూ ప్రగల్బాలు పలికిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలీసుల విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని విమర్శలు వస్తున్నాయి.
పట్టుకోండి చూద్దాం! - పోలీసులకు సవాల్ విసురుతున్న కాకాణి - POLICE NOT FIND KAKANI
అల్లుడి మీద ప్రేమ - పేదల భూములను లాక్కుని గిఫ్ట్‌గా ఇచ్చిన మాజీ మంత్రి