Pawan Help to Murali Nayak Family: దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీరజవాను మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మురళీనాయక్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సవిత, అనగాని, సత్యకుమార్, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు నివాళులు అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను పవన్ కల్యాణ్, లోకేశ్ ఓదార్చారు.
మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అదేవిధంగా మురళీ కుటుంబానికి ఐదెకరాలు, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు పవన్ తెలిపారు.
రూ.25 లక్షల వ్యక్తిగత సాయం: మురళీనాయక్ కుటుంబానికి రూ.25 లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మురళీ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా 3 పార్టీలు సిద్ధంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అతని కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై పవన్ మండిపడ్డారు. పాకిస్థాన్ అమాయకులను పొట్టన పెట్టుకుంటోందని, కాల్పుల విరమణ అవగాహన తర్వాత కూడా ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదం భారత్‌కు ఇబ్బందిగా మారిందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకున్నారని, ఉగ్రవాదానికి ముగింపు పలకాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.
జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు: చిన్న వయసులో మురళీనాయక్ మృతి బాధాకరమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. సైన్యంలో చేరాలని మురళీ చిన్నప్పటి నుంచి ఆసక్తి చూపేవారని, దేశం కోసం పోరాడుతానని తరచూ చెప్పేవారని తెలిపారు. భారత్ జెండా కప్పుకుని చనిపోతానని మురళీనాయక్ చెప్పేవారని పేర్కొన్నారు. మురళీ కుటుంబానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మురళీనాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయంతో పాటు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు లోకేశ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించామని లోకేశ్ చెప్పారు.
పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన- డ్రోన్ దాడిలో BSF సబ్ ఇన్స్పెక్టర్, ఆర్మీ జవాన్ మృతి