AP Government Will Launch One School One App For Students : పిల్లల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? వారికి ఏ సబ్జెక్టు ఏ టీచర్ చెబుతున్నారు? పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో తల్లిదండ్రులు ఒక్క క్లిక్‌తో తెలుసుకునేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. గత ప్రభుత్వంలో పిల్లల మార్కులు, వారి అభ్యసన సామర్థ్యాలను తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అర చేతిలోనే సమస్త సమాచారం అందించేలా యాప్‌ను రూపొందిస్తోంది.
‘ఒకే పాఠశాల- ఒకే యాప్’ : ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, పిల్లల అపార్ నంబరుతో లాగిన్ అయితే చాలు ఆ పాఠశాల సమస్త సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ‘ఒకే పాఠశాల- ఒకే యాప్’ విధానంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సెక్యూరిటీ పరీక్షల్లో ఉన్న ఈ యాప్‌ను త్వరలో మంత్రి ప్రారంభించనున్నారు.
ప్రత్యేక డ్యాష్‌బోర్డు : ఈ యాప్‌తోపాటు ప్రజలందరూ బడుల పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డును తీసుకొస్తున్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో విద్యార్థుల వివరాలను పాఠశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ వివరాలను వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ 45 రకాల మాడ్యుల్స్ ద్వారా వివరాలు తీసుకుంటోంది. ప్రతిసారి ఉపాధ్యాయులు వాటిని నింపాల్సి వస్తోంది. ఇది టీచర్లకు భారంగా మారుతోంది. ఒకసారి యూడైస్‌ప్లస్, విద్యార్థుల కిట్ల పంపిణీ, మరోసారి మౌలిక సదుపాయాల వివరాలు, స్టూడెంట్ ఇన్ఫో ఇలా అనేక రకాలుగా సమాచారం తీసుకుంటున్నారు.
ఈ మేరకు ప్రతిసారి అన్ని వివరాలు నింపాల్సి వస్తోంది. ఉపాధ్యాయులకు ఇలాంటి సమస్య లేకుండా యాప్‌తో వెసులుబాటు కలగనుంది. ఏ సమాచారం నింపాలన్న అప్పటికే విద్యాశాఖ వద్దనున్న వివరాలు ఆయా ఫార్మాట్‌లోకి వస్తాయి. మిగతావాటిని నింపితే సరిపోతుంది. ప్రతిసారి పూర్తి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఉపాధ్యాయుల సర్వీసు, డాటా, హాజరు మొత్తం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
తల్లిదండ్రులకు ప్రత్యేక లాగిన్ : విద్యార్థుల తల్లిదండ్రులకు యాప్ లాగిన్ ఇస్తారు. పిల్లల హాజరు, పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు, బడిలో చేసిన ఆరోగ్య పరీక్షల నివేదికలు పరిశీలించవచ్చు. పాఠశాలలోని గ్రంథాలయం, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్లు, ఐఎఫ్‌పీ ప్యానళ్లు, స్మార్ట్‌టీవీలు ఇలా సమస్త సమాచారం ఫోన్‌లోనే చూసుకోవచ్చు.
పాఠశాలలు తెరవడానికి ముందే పాఠ్య పుస్తకాలు - ఇప్పటికే కొన్ని రాక!
ఐదు అంశాలు ప్రాధాన్యంగా 'లీప్' స్కూళ్లు - వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు