Suparipalana Meeting in AP : కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయం వెనుకభాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ సమావేశం జరుగనుంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన జూన్ 12నే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు.
ఇవాళ్టి సమావేశంలో ఏడాది కాలంగా చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపైనా ప్రధానంగా దృష్టి పెట్టనుంది. అమరావతిలో జరిగే కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు, సెక్రటరీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక, పాలనా విధ్వంసాలను సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర-2047 విజన్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణం, ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకురావడం సహా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
భవిష్యత్ లక్ష్యాలపై ప్రధానంగా చర్చ : సంవత్సర కాలంగా చేసిన పాలనను సమీక్షించుకుంటూనే రాష్ట్ర భవిష్యత్ కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి? ఎలాంటి లక్ష్యాలు సాధించాలనే అంశాలనూ సమావేశంలో చర్చించనున్నారు. గతేడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ వివరిస్తూ ఈ సంవత్సరం చేపట్టే కార్యక్రమాలను సమావేశంలో చర్చించనున్నారు.
సాయంత్రం జరగనున్న సమావేశ ప్రాంగణంలో అధికారులు ప్రత్యేకంగా రౌండ్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే చోట ఆసీనులయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏడాదికాలంలో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేపట్టబోయే సంక్షేమ, ప్రగతి ప్రణాళికలపై విస్తృతంగా చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర- 2047 విజన్ ప్రణాళిక అమలు ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే ప్రణాళికలపైనా సమీక్షిస్తారు. సమావేశం అనంతరం అందరితో కలిసి సీఎం చంద్రబాబు అక్కడే భోజనం చేస్తారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో ఏడాది పూర్తి - కీలక హామీలు అమలు