Govt to Distribute Fishermen Insurance Money: సముద్రంలో మరపడవల్లో మత్స్యకారులు చేపల వేట చేయటం మంగళవారం నుంచి నిలిచిపోయింది. ఈ క్రమంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సమయంలో మత్స్యకారులను ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.20 వేల చొప్పున ఈ నెల 26వ తేదీ నుంచి పంపిణీ చేయనుంది.
బాపట్ల జిల్లాలో 2596 వేట చేసే పడవలు ఉండగా 10,050 కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ రూ.20.10 కోట్లు ప్రభుత్వ సహాయం అందించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20 వేలు సాయం అందనుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేట నిషేధకాలంలో రూ.10 వేలు ఇవ్వగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ నగదు రూ.20 వేలకు పెంచి గంగపుత్రులకు సాయం చేస్తోంది. ఈ నెల 26 వతేది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ఈ సొమ్ము జమ చేయనున్నారు. జూన్ 14వ తేది వరకు సముద్రంలో అధికారులు చేపల వేట నిషేధించారు. ఈ రోజుల్లో చేపలు, రొయ్యలు సంతాన ఉత్పత్తి ప్రక్రియ జరిగి మత్స్య సంపద పెరుగుతుంది. ప్రతి ఏడు ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తారు.
సంద్రంలో 61 రోజులపాటు చేపల వేట నిషేధం - నేటి అర్ధరాత్రి నుంచి అమలు
వాటికి ఎలాంటి ఆంక్షలు ఉండవు: రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇందుకు 2 నెలల సమయం పడుతుంది. తద్వారా ఇవి మత్స్యకారుల ఉపాధికి దారి చూపుతాయి. ఈ కారణంతోనే ఏటా చేపల నిషేధం అమలులో ఉంటుంది. ఈ సమయంలో మర, ఇంజిన్ బోట్లు వేటకు దూరంగా ఉండాలి. కర్ర తెప్పలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. మత్స్యకారలు నిబంధనలు అతిక్రమించకుండా అధికార యంత్రాంగం పర్యవేక్షణ చేస్తుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు 15 ఏళ్ల కిందటి వరకు బియ్యం ఇచ్చేవారు. ఆ తర్వాత నగదు అందిస్తూ వస్తున్నారు.
అర్హత కలిగిన వారికి మత్స్యకార భరోసా కింద రూ.20 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇంజిన్ తెప్పకు ఆరుగురు, పెద్ద మర పడవలకు 8 మంది ఉంటారు. చేపల వేట నిషేధానికి సంబంధించి గ్రామాల వారీగా ఉద్యోగులకు సూచనలు చేశామని అధికారులు తెలిపారు. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళ్తే కేసులు నమోదు చేయడంతోపాటు సంక్షేమ పథకాల లబ్ధికి దూరమవుతారని హెచ్చరించారు.
హార్బర్‌తో లాభమా? నష్టమా? అనుమానాలు తీర్చాలంటున్న మత్స్యకారులు
సముద్రంలో నిలిచిన బోటు - అధికారుల సత్వర స్పందన - 9 మంది మత్స్యకారులు సేఫ్