AP Property Registration Certified Copy : సాధారణంగా మన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలను తరచూ బయటకు తీయము. ఎక్కడో బీరువాలో పెట్టేస్తాం. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు ఆ పత్రాలు పోతాయి. ఆ సమయంలో ఎంతో ఆందోళనకు గురవుతాం. వాటిని మళ్లీ ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సీసీలను అందిస్తోంది. అసలు ఈ సీసీలు ఏంటి? ఎలా పొందచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు పత్రాలతో సమానమైన గుర్తింపు : ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు పోగొట్టుకుంటే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారికంగా సర్టిఫైడ్ కాపీ(సీసీ)ని అందిస్తుంది. వీటిని మీసేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా పొందచ్చు. అది కూడా కేవలం 24 గంటల్లోనే వీటిని పొందవచ్చు. ఈ ధ్రువీకరణ పొందిన డాక్యుమెంట్లకు అసలు పత్రాలతో సమానమైన గుర్తింపు ఉంటుంది. అసలు వాటికి ప్రత్యామ్నాయంగా సర్టిఫైడ్ కాపీలను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా తీసుకునే వీలుంది.
ఎలా పొందొచ్చంటే?:
- ఆస్తికి సంబంధించిన దస్తావేజు సంఖ్య, రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరం, హద్దులు, విస్తీర్ణంతో పాటు దరఖాస్తుదారుడి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.
- మీసేవా కేంద్రాల నుంచి అయితే 510 రూపాయల నగదు చెల్లించాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే దరఖాస్తుకు 50 రూపాయల స్టాంపు పత్రాన్ని జత చేసి సమర్పిస్తే సరిపోతుంది.
- ఈ ప్రక్రియ పూర్తయిన 24 గంటల్లో అధికారికంగా ధ్రువీకరించిన సర్టిఫైడ్ కాపీని ఆ శాఖ ఆమోద ముద్రతో అందజేస్తారు.
2008 నుంచి మాత్రమే సీసీలు : ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు న్యాయస్థానాలకు సమర్పించాల్సి వస్తే సర్టిఫైడ్ కాపీలనే ఆమోదిస్తారు. ఈ పత్రాలతో క్రయవిక్రయాలు చేపట్టాల్సి వస్తే మీసేవా కేంద్రాల ద్వారా పోలీసు శాఖకు దస్తావేజులు పోయాయని ముందుగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాలి. ఆ తర్వాత సర్టిఫైడ్ కాపీలకు ఎఫ్‌ఐఆర్ నకలు అటాచ్ చేసి అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. అయితే 2008 నుంచి చేపట్టిన రిజిస్ట్రేషన్లకు మాత్రమే సర్టిఫైడ్ కాపీలు అందుబాటులో ఉంటాయి.
ఆఫీసులకు వెళ్లాల్సిన పన్లేదు! - ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ దస్తావేజులు, నకళ్లు
రాష్ట్ర ప్రజలకు అలర్ట్ - పౌరసేవలు, ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆ వివరాలు తప్పనిసరి!