Other Essentials Instead Of Taking Ration Rice : రేషన్ బియ్యం వద్దన్న వారికి ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ విధానం అమలుపై పౌరసరఫరాలశాఖ ద్వారా అధ్యయనం చేయిస్తోంది. బియ్యం వద్దన్న వారికి నగదు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 1న కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ బియ్యానికి బదులు నగదు పంపిణీ అంశం చర్చకు వచ్చింది.
కార్డుదారుల అభిప్రాయాలు సేకరించి అమలు చేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. రేషన్ బియ్యంపై కిలోకు రూ.46 చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. అయితే అధికశాతం కుటుంబాలు బియ్యాన్ని తీసుకుని కిలో రూ.10 నుంచి రూ.11కు అమ్ముకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు అందించే విధానంపై కసరత్తు చేస్తోంది.
పేరు మారినా బియ్యం కార్డుకు డిమాండు : పేదరికానికి రేషన్‌కార్డే ప్రామాణికం. కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పిస్తున్నారు. అందుకే అధికశాతం కుటుంబాలు బియ్యం అవసరం లేకున్నా రేషన్‌కార్డులు తీసుకుంటున్నాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే నిజమైన పేదలను గుర్తించి సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందించాలని గతంలో నిర్ణయించిన ప్రభుత్వం బియ్యం కార్డుగా పేరు మార్చింది. అయినా ప్రభుత్వశాఖలు మాత్రం అర్హుల ఎంపికకు ఆరు అంచెల వడపోత (six step validation) అమలు చేస్తూ బియ్యం కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఫలితంగా పేరు మారినా బియ్యం కార్డుకు డిమాండు తగ్గలేదు.
వారికి రేషన్ బియ్యమే ఆధారం : రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డులున్నాయి. వీరిలో 30శాతం కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే ఆధారం. అంటే సుమారు 44 లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఎంతో అవసరం. మిగిలిన 70% మంది అవసరం లేకున్నా బియ్యం కార్డును నిలబెట్టుకునేందుకు నెల నెలా ఉచిత బియ్యం తీసుకుంటున్నారు. వాటిని ఎండీయూ వాహనదారులు కిలో రూ.10 నుంచి రూ.11 చొప్పున కొని నల్లబజారుకు తరలిస్తున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఇదొక మాఫియాగా తయారైంది.
ఒక్కో కుటుంబంపై రూ.920 : ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొని మిల్లింగ్ చేయించి వచ్చిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోంది. ధాన్యం కొనుగోలుతోపాటు రవాణా, అన్ని రకాల ఖర్చులు, కమీషన్ కలిపి కిలో బియ్యానికి రూ.46 ఖర్చు అవుతోంది. రాష్ట్రంలో 1.46 కోట్ల కార్డుల్లో 90 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం అందిస్తోంది. మిగిలిన 56 లక్షల కార్డుదారులకు రాష్ట్రమే సొంతంగా రూ.6,193 కోట్లు భరిస్తోంది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వానికి రూ.920 అవుతోంది. అంటే ఆ మొత్తానికి సరిపడా కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని యోచిస్తోంది.
ఇంటింటికీ వెళ్లి రేషన్ అందజేసిన కలెక్టర్ - యోగక్షేమాలు తెలుసుకున్న నాగరాణి
ధాన్యం సేకరణపై ప్రభావం : ప్రభుత్వం మద్దతు ధరపై ఏటా సుమారు 42 లక్షల నుంచి 50 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తూ 25.46 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. నగదు బదిలీ అమలు చేస్తే మిగిలే బియ్యాన్ని ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విదేశాల నుంచి డిమాండ్ ఉన్నా పౌరసరఫరాలశాఖ ద్వారా ఎగుమతి చేసే వ్యవస్థ లేదు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విదేశాలతో ఒప్పందం చేసుకుని ఎగుమతులు చేపట్టింది. ఏపీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది.
మాఫియా నోట్లో పచ్చి వెలక్కాయే! : రేషన్ బియ్యం పేదల కోసమే అయినా 70 శాతం బియ్యం నల్లబజారుకు తరలుతోంది. రూ.వేల కోట్ల లావాదేవీలతో ఇదో పెద్ద మాఫియాగా తయారైంది. ధాన్యం సేకరణ మొదలుకొని అడుగడుగునా అక్రమాలే. రైతు నుంచి ధాన్యం కొనాలంటే ఎదురు సొమ్ము వసూలు చేస్తున్నారు. మిల్లింగ్, స్టేజ్-1, 2 రవాణా, రేషన్ దుకాణాలు, ఎండీయూ వాహనాల వరకు ఎక్కడికక్కడ పక్కదారి పడుతున్నాయి. అంతటా వసూళ్ల రాజ్యమే. నగదు బదిలీ వస్తే మాఫియా నోట్లో పచ్చి వెలక్కాయ పడుతుంది.