Polavaram Tourism Updates : పోలవరం ప్రాజెక్టు పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఓ వైపు ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగుతుండగా సమాంతరంగా పర్యాటక ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో అధికారులకు టూరిజం అభివృద్ధిపై ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆ శాఖ అధికారులు కొండలను పరిశీలించారు. పుష్కరాల నాటికి పోలవరంలో పర్యాటక వైభావాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
గాలికొదిలిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం : 2014లో టీడీపీ హయాంలోనే పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కసరత్తు జరిగింది. ప్రాజెక్టు దగ్గర యూనిక్ వంతెన నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన సైతం చేశారు. 2019లో తెలుగుదేశం సర్కార్ అధికారంలోకి వస్తే చాలా వరకు పనులు జరిగేవి. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడంతో ప్రాజెక్టు నిర్మాణమే గాలికొదిలేయగా టూరిజం వైపు కన్నెత్తి చూడలేదు.
పునరుత్తేజం : ఇటీవల ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక ప్రగతిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రాజెక్టు దగ్గర యూనిక్ వంతెన ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు దగ్గర ఉన్న నాలుగు కొండలపై సందర్శకుల విడిదికి అతిథి గృహాలు నిర్మించడానికి కసరత్తు చేస్తున్నారు. ఇటీవల విజయవాడ నుంచి రెండు సార్లు పర్యాటక శాఖ అధికారులు వచ్చారు. కొండలపై అతిథి గృహాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలను అనుసంధానం చేస్తూ మరో వంతెన నిర్మాణం చేేపట్టనున్నారు. పర్యాటకులకు ప్రయాణం చాలా సులభతరమవుతుంది. ప్రాజెక్టు నుంచి పాపికొండలు, ధవళేశ్వరం వరకు పర్యాటకులను ఆకర్షించేలా అతిథి గృహాలు, బోటింగ్ ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
ఎంతో మేలు : కార్యాచరణ సాకారమైతే ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో మహత్తర పర్యాటక కేంద్రంగా విలసిల్లుతుంది. సందర్శకులు విజయవాడ దుర్గ గుడి నుంచి మొదలు పెట్టి ద్వారకాతిరుమల, మద్ది, పట్టిసీమ, పోలవరం, పాపికొండలు రాజమహేంద్రవరం, ధవళేశ్వరం వరకు చూసేందుకు అవకాశం ఉంది. ఈ పరిణామంతో జిల్లాలో పర్యాటక ఆదాయం బాగా పెరుగుతుంది. వందల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వృద్ధి చెందుతాయి.
కొండల నడుమ పోలవరం - 5 ఏళ్ల విరామం తర్వాత చకచకా పనులు
తొమ్మిది నెలల్లోనే 6 శాతం పూర్తైన పోలవరం - వరదల్లోనూ పనులు చేసేలా ఏర్పాట్లు