బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైన జగన్‌ సర్కార్ - కట్టుకథలు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Feb 13, 2024, 9:02 AM IST

AP_Government_Cheating_Banks

AP Government Cheating Banks: 'బ్యాంకులకు టోకరా' అనగానే విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఘరానా మోసగాళ్లు గుర్తుకొస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దయ వల్ల ప్రభుత్వాలు కూడా బ్యాంకుల్ని మోసం చేయడాన్ని చూసే మహద్భాగ్యం మనకు కలగబోతోంది. అయిదేళ్లలో రాష్ట్ర ప్రతిష్ఠను జాతీయస్థాయిలో గంగలో కలిపిన జగన్‌, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బ్యాంకుల్నే బురిడీ కొట్టించిందన్న అపకీర్తినీ కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం గత ప్రభుత్వ తలపెట్టిన అపార్ట్‌మెంట్‌ టవర్ల నిర్మాణ పనుల్ని అధికారంలోకి రాగానే ఎక్కడికక్కడ నిలిపేసిన జగన్‌ సర్కార్‌, అవి పూర్తయినట్లుగా బ్యాంకుల కళ్లుగప్పాలని సీఆర్డీఏపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైన జగన్‌ సర్కార్ - కట్టుకథలు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి

AP Government Cheating Banks: రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చింది. 2వేల 560 కోట్ల అంచనా వ్యయంతో రాజధాని పరిపాలన నగరంలో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు తలపెట్టింది. యూబీఐ లీడ్‌ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం ఈ ప్రాజెక్టుకు 2వేల 60 కోట్లు మంజూరు చేసింది. అందులో సీఆర్డీఏకు సుమారు 19 వందల 50 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ గ్యారంటీ ఇచ్చింది.

మొత్తం 3 వేల 840 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ల నిర్మాణం 62 నుంచి గరిష్ఠంగా 74 శాతం వరకు పూర్తయి ఉండగా, అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం ఆ పనులను ఎక్కడివక్కడ నిలిపివేసింది. తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిబంధనల ప్రకారం రుణం ఇచ్చిన బ్యాంకులకు ఎప్పటికప్పుడు నిర్మాణ పురోగతి చూపించాలి. ఒప్పందం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలోనే నిర్మాణం పూర్తి కావాలి. అయితే అప్పటికే చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి అనీ, పలువురు అపార్ట్‌మెంట్​లలో నివాసం ఉంటున్నారని అధికారులు కట్టుకథలు చెప్పారు. మిగిలిన ఫ్లాట్ల నిర్మాణం 2024 ఫిబ్రవరి 13 నాటికి పూర్తి చేస్తామని నమ్మించారు.

అమరావతిపై జగన్ సర్కార్ మరో కుట్ర! - మాస్టర్​ ప్లాన్​ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం

అమరావతిని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేసిందని తెలిసినా ఈ కథలన్నింటికీ బ్యాంకు అధికారులు తలూపేశారు. ఒక ఏడాది గడువూ పొడిగించారు. అది కూడా నేటితో ముగుస్తోంది. గడువులోగా ప్రాజెక్టు పూర్తవకపోతే బ్యాంకులు దాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించే ప్రమాదముంది. అదే జరిగితే రుణం మొత్తాన్ని సీఆర్‌డీఏ ఒకేసారి చెల్లించాలి. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు సీఆర్డీఏ.. బ్యాంకు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుకూలంగా డీసీసీవో పత్రం ఇప్పించుకునేలా రంగం సిద్ధం చేసినట్లు, ఈ విషయమై బ్యాంకు అధికారులతో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

2017లో ఈ ప్రాజెక్టు అంచనాలు తయారు చేసినప్పుడు 2వేల 560 కోట్లుగా ఖరారు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ అయిదేళ్లలో పనులు నిలిపివేయడంతో అంచనా వ్యయం బాగా పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు మంజూరు చేసిన మొత్తంలో ఇంకా సుమారు 110 కోట్లు విడుదల కావాలి. మరోవైపు ప్రాజెక్టు వ్యయంలో తన వాటాగా ఇవ్వాల్సిన 500 కోట్లను ప్రభుత్వం నేటికీ విడుదల చేయలేదు. దీంతో ఫ్లాట్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్తు, తాగునీరు, మురుగునీటిపారుదల తదితర వసతులేవీ సమకూరలేదు.

హౌసింగ్‌ ప్రాజెక్టు నిరర్థక ఆస్థిగా మిగిలిందా అంతే సంగతి - జగన్‌ సర్కారు వైఖరితో రుణ సంక్షోభంలో సీఆర్డీఏ

ఈ నేపథ్యంలో బ్యాంకులు హౌసింగ్‌ ప్రాజెక్టును నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తే దానికి గ్యారంటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే రుణభారాన్ని కూడా మోయాలి. అది కూడా ఒకేసారి రుణం మొత్తాన్ని వడ్డీతో కలిపి బ్యాంకులకు కట్టాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తాన్ని ఆగమేఘాలపై చెల్లించడం జగన్‌ ప్రభుత్వానికి దాదాపు అసాధ్యం. దీంతోపాటు భవిష్యత్తులో బ్యాంకుల నుంచి రుణ మంజూరూ కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినట్లు నిర్మాణాలు పూర్తయిపోయాయని ధ్రువపత్రం ఇస్తే.. రానున్న రోజుల్లో ఏం ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళన సీఆర్డీఏ అధికారులను వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై సీఆర్డీఏ, బ్యాంకు అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. స్పందించేందుకు నిరాకరించారు.

రాష్ట్ర ప్రజలనే కాదు.. అబద్ధాలతో వైసీపీ ప్రభుత్వం కోర్టులను సైతం మోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.