AP Govt on VMRDA Master Plan Roads : విశాఖ నగరంలో మొబిలిటితో పాటు కనెక్టివిటీ పెంచేలా ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రూ.154 కోట్ల వ్యయంతో 26.7 కిలోమీటర్ల పొడవున నిర్మాణం చేపట్టేందుకు వీఎంఆర్డీఏకు సర్కార్ అనుమతిచ్చింది. బీచ్ రోడ్డుతో పాటు జాతీయరహదారి 16ని అనుసంధానించేలా మాస్టర్ ప్లాన్ను ప్రతిపాదించింది.
విశాఖపట్నంలో 7 మాస్టర్ ప్లాన్ రహదారులను చేపట్టేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ 154 కోట్ల వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. విశాఖలోని అర్బన్ మొబిలిటీని, కనెక్టివిటీని పెంచేలా వీటిని చేపట్టనుంది. దీంతో పాటు వేర్వేరు ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా దీనిని రూపొందించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతగా ఈ ఏడు మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ హైవేలు, బీచ్ రోడ్డు, ఇతర ప్రధాన రోడ్లను అనుసంధానించేలా వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రోడ్లపై వీఎంఆర్డీఏ కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదనల్ని పురపాలక శాఖ ఆమోదాన్ని తెలియజేసింది. ఈపీసీ ప్రాతిపదికన ఈ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
- చిప్పాడ నుంచి విశాఖ వరకూ దివీస్ రోడ్డును 24 మీటర్ల వెడల్పుతో 6.32 కిలోమీటర్ల పొడవున నిర్మించి వివిధ రహదారులను అనుసంధానించనున్నారు. దీని కోసం రూ.37 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- నేరెళ్లవలస నుంచి తాళ్ల వలస వరకూ వయా దొరతోట కొత్త వలస రోడ్డు వరకూ మరో మాస్టర్ ప్లాన్ రోడ్డును నిర్మించనున్నారు. ఇది కూడా 24 మీటర్ల వెడల్పుతో 4 కిలోమీటర్ల పొడవున నిర్మాణం చేపట్టనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి రూ.24 కోట్ల వ్యయం కానుంది.
- వీఎంఆర్డీఏ పరిధిలో బోయపాలెం జంక్షన్ వద్ద పరదేశిపాలెం నుంచి కాపులుప్పాడ వరకూ 30 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణాన్ని 3.10 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. దీని కోసం రూ.7.46 కోట్ల వ్యయం కానుంది.
- గంభీరం నుంచి జాతీయ రహదారి 16 వరకూ 2.2 కిలోమీటర్ల మేర రూ.11.97 కోట్లతో చేపట్టనున్నారు.
- పరదేశిపాలెం నుంచి గంభీరం వరకూ 1.4 కిలోమీటర్ల హదారిని రూ.5.6 కోట్లతో చేపట్టనున్నారు.
- అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో శివశక్తి నగర్ నుంచి వుడా 30 మీటర్ల రహదారి వరకూ హరితా ప్రాజెక్ట్సు వద్దకు 1.7 కిలోమీటర్ల పొడవైన మాస్టర్ ప్లాన్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి రూ.7.6 కోట్లు వ్యయం కానుంది.
అలాగే అడవివరం జక్షన్ బీఆర్టీఎస్( శోంఠ్యాం రోడ్డు) నుంచి గండిగుండం జాతీయ రహదారి జంక్షన్ వరకూ 8 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి రూ.60 కోట్ల వ్యయం చేయనున్నారు. మొత్తంగా రూ.154.6 కోట్లతో 26.72 కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు గానూ స్థానికంగా టీడీఆర్ బాండ్ల ఇచ్చేందుకు జీవీఎంసీకి, వీఎంఆర్డీఏకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ - 12 చోట్ల పైవంతెనలు, 35 పైగా రహదారులు