AP DSC WILL CONDUCT EVERY YEAR: ఏడేళ్ల తర్వాత విజయవంతంగా మెగా డీఎస్సీ చేపట్టామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పకడ్బందీగా పరీక్ష ప్రారంభించిన యంత్రాంగానికి అభినందనలు చెప్పారు. ఇకపై ప్రతీ సంవత్సరం డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించామన్నారు. మొట్టమొదటి సారిగా 4 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చామని గుర్తు చేశారు. 100 శాతం అక్షరాస్యతకై ప్రాజెక్ట్ అ - ఆ (అక్షర ఆంధ్ర) ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం: రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్ధుల నిరీక్షణకు తెరపడేలా మెగా DSC-2025 పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు 154 కేంద్రాల్లో పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండున్నర నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 137 కేంద్రాలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో 17 కేంద్రాలను పరీక్ష కోసం ఏర్పాటు చేశారు.
#MegaDSCinAndhraPradesh
— Lokesh Nara (@naralokesh) June 6, 2025
ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించాను. ఏపీ చరిత్రలో తొలిసారిగా అత్యధికంగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టాం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం. ఎలాంటి… pic.twitter.com/ECaDT2WQR8
రాష్ట్రవ్యాప్తంగా మెగా DSC పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3 లక్షల 36 వేల 305 మంది అభ్యర్థులు 5 లక్షల77 వేల 675 దరఖాస్తులు సమర్పించారు. కొందరు అభ్యర్ధులు వారి అర్హతల ఆధారంగా ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో అధికంగా SGT, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రాథమిక 'కీ' విడుదల చేయనున్నారు. వారంపాటు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చారు.
జిల్లాల్లో తొలిరోజు మెగా డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థుల్ని పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. మరోవైపు డీఎస్సీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులందరికీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు మీతోనే ప్రారంభమవుతుందని వారిలో చైతన్యం నింపారు.