AP DSC 2025 Hall Tickets: ఏపీ మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలను జూన్ 6 నుంచి జులై 6 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించనుంది. డీఎస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నెట్ లాంటి కొన్ని పరీక్షలు ఉన్నందున ఒక ఐదారు రోజులు మధ్యలో పరీక్షలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.
అందుబాటులోకి హాల్ టికెట్లు: డీఎస్సీ నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసిన 80 శాతం మందికి మొదటి ఐచ్చికంగా నమోదు చేసుకున్న పరీక్ష కేంద్రాలు వచ్చేలా చర్యలు తీసుకుంది. దరఖాస్తుల సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించి 8 వరకు ప్రాధాన్యత క్రమంలో ఐచ్చికాలు స్వీకరించారు.
వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించారు. హాల్ టికెట్లను శుక్రవారం రాత్రి నుంచి ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఏపీకి చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు పెద్దమొత్తంలో దరఖాస్తు చేశారు.
ఆన్‌లైన్ పరీక్షలను మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు, అనంతరం పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లకు ఉంటాయి. చివరిగా ఎస్జీటీలకు నిర్వహిస్తారు. చదువుకునేందుకు కొంత సమయం కావాలని, ఎస్జీటీలకు చివరిగా పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరినందున ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. డీఎస్సీ పరీక్షలను రోజు రెండు విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు ఉంటాయి.
ప్రిన్సిపల్, పీజీటీ, పీడీ పోస్టులకు మాత్రం పరీక్ష మూడు గంటల పాటు ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇవన్నీ ఉదయం సెషన్‌లో ఉన్నాయి. టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అభ్యర్థులకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది. ఇది గంటన్నర ఉంటుంది. జిల్లాకో ప్రశ్నపత్రం, 90 రోజులు అదనపు సమయం కావాలంటూ అభ్యర్థులు చేస్తున్న అభ్యర్థనలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గతేడాది నవంబరులోనే డీఎస్సీ సిలబస్‌ను ఆన్‌లైన్ ఉంచామని, దీంతో అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఆరు నెలల కంటే ఎక్కువ సమయం లభించిందని పేర్కొంది.
విద్యా సంవత్సరం జూన్‌లో ప్రారంభమవుతున్నందున 90 రోజులు అంతకంటే ఎక్కువ సమయం ఇస్తే విద్యా సంవత్సరం మధ్యలో వారు చేరాల్సి వస్తుందని పేర్కొంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం పడుతుందని వెల్లడించింది. డీఎస్సీ పారదర్శకంగా, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించేందుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష మంచిదని, పేపర్ లీకేజీలు ఉండవని తెలిపింది. ఫలితాలను నార్మలైజేషన్ చేస్తారని, ఈ విధానాన్ని న్యాయస్థానాలు సైతం సమర్థించాయని పేర్కొంది.