CRDA 48th Authority Meeting: రాజధాని అమరావతికి సంబంధించి రెండో దశ ప్రాజెక్టుకు దాదాపు 45 వేల ఎకరాలను భూసమీకరణలో భాగంగా తీసుకోనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 38 వేల ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతుల నుంచి అంగీకారం వచ్చిందని తెలిపారు. కొత్తగా సమీకరణ చేసిన భూమిని అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడానగరం, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం వినియోగిస్తామని వెల్లడించారు. తొలి విడతలో భూసమీకరణ నిబంధనలే మలి విడతకూ వర్తింపజేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ 48 వ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో ఏర్పాటయ్యే విద్య, వైద్య సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రెండో దశలో భూసమీకరణకు సంబంధించిన వివరాలను మంత్రి నారాయణ వివరించారు.
తొలి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూసమీకరణకు అనుసరించిన నిబంధనలే, రెండో దశకు సైతం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. 5 వేల ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2 వేల 500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఈ భూమి సమీకరించనున్నట్లు తెలిపారు. సుమారు 38 వేల ఎకరాల భూసమీకరణ ద్వారా ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.
రాజధాని నిర్మాణానికి తొలి దశలో భాగంగా రైతుల నుంచి తీసుకున్న 34 వేల ఎకరాలకు విలువ పెరగాలన్నా, అది నిలబడాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎంతో అవసరమని మంత్రి నారాయణ వివరించారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌లో స్పోర్ట్స్ సిటీ కోసం దాదాపు 120 ఎకరాలను కేటాయించామని, అంతర్జాతీయ క్రీడా సదుపాయాలను కల్పించాలన్న ఉద్దేశంతో 2 వేల 500 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు నారాయణ తెలిపారు.
రాజధానిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ సంస్థల కన్సార్షియంని ఆహ్వానించామని, కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతో వారు వెనకడుగు వేస్తున్నారని మంత్రి తెలిపారు. వారిని మళ్లీ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మంత్రి వారు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని పేర్కొన్నారు.
''సీఎం చంద్రబాబు గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను హైదరాబాద్లో ఏ విధంగా అభివృద్ధి చేశారో అదే విధంగా అమరావతిలో 5 వేల ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. రాజధానిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ సంస్థల కన్సార్షియంని ఆహ్వానించాం. 5 వేల ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2 వేల 500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఈ భూమి సమీకరించనున్నాం. 38 వేల ఎకరాల భూసమీకరణ ద్వారా ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు''-మంత్రి నారాయణ
అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపు - సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం
103 ఎకరాల్లో ఏపీ అసెంబ్లీ భవనం - రూ.45 వేల 249 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం