AP CABINET MEETING KEY DECISIONS: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించారు. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో జరిగిన సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చ జరిగింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు మంత్రి వర్గం అమోదం తెలిపింది.
సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదానీ పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు, కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపునకు నిర్ణయించారు. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి ఇచ్చారు. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపారు. ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్‌లో చర్చించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ అమోదం తెలిపింది. ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో (SIPB) ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం లభించింది. 30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ: ఏపీ కేబినెట్‌లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చజరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం పడిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలు అధికారులు వెల్లడించారు.
రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ చేయనుంది. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాలు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్‌పై చర్చ జరిగింది. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్ర స్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.
మీ తపన, కృషి స్ఫూర్తిదాయకం - సీఎం చంద్రబాబును అభినందిస్తూ బిల్‌గేట్స్ లేఖ
2047 నాటికి ప్రపంచంలో టాప్ 2 నగరాల్లో హైదరాబాద్, అమరావతి: చంద్రబాబు