Andhra University Students Innovation: ఇంట్లో లైట్లు, ఫ్యాన్‌లు, ఏసీలు ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా లేచి వెళ్లి స్విచ్ నొక్కాలి. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య కారణంగా మంచంపైనే ఉండేవారికి ఇది కాస్త కష్టమే. ఇలాంటి వారందరికీ ఉపయోగపడే విధంగా కూర్చున్న చోట నుంచే వేలు చూపిస్తే పని జరిగిపోతే ఎలా ఉంటుంది? అనే ఉద్దేశంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు ఎం.ప్రదీప్తి, బి.కృపారాణి, బి.చందన లాశ్రీ, ఎ.నవ్య ఇదే ఆలోచన చేశారు.
వేలు చూపిస్తే లైట్లు వెలుగుతాయ్: వారికి ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న పలు పరికరాలను పరిశీలించారు. వాయిస్, సౌండ్ ద్వారా అవి పని చేస్తున్నాయని తెలుసుకున్నారు. అంతే కాకుండా వాటి ఖరీదు సైతం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీనికి ప్రధాన కారణం వాటిల్లో ఉపయోగించిన సెన్సర్‌లు. ఒక్కో సెన్సర్ ఖరీదు 7 వేల రూపాయల వరకు ఉంటుంది. వాటన్నింటికీ పూర్తి భిన్నంగా సెన్సర్లు అవసరం లేకుండా కేవలం చేతి వేళ్లు చూపిస్తే పని చేసేలా 45 రోజులపాటు పరిశోధన చేసి ఇంటెల్లీ గెశ్చర్స్ అనే పరికరాన్ని రూపొందించారు.

కేవలం 1000 రూపాయలతోనే వినూత్న ఆవిష్కరణ: ఇంటెల్లీ గెశ్చర్స్ పరికరంలో ఆర్డునో యునో అనే మైక్రో కంట్రోలర్‌ను ఏయూ విద్యార్థులు అమర్చారు. పైథాన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కంప్యూటర్ కెమెరా ముందు చేతి వేళ్లు ఉంచడం ద్వారా ఇంట్లో ఉండే ఉపకరణాలు పని చేసేలా ఈ పరికరాన్ని డిజైన్ చేశారు. త్వరలో దీనికోసం యాప్ రూపొందించనున్నట్లు తెలిపారు. ఇది అందుబాటులోకి వస్తే ఇంటెల్లీ గెశ్చర్స్ పరికరం అమర్చుకోవడం ద్వారా మొబైల్ ఫోన్‌కి చేతి వేళ్లు చూపించి ఇంట్లో ఉండే ఉపకరణాలను నియంత్రించవచ్చని విద్యార్థినులు అంటున్నారు. దీని తయారీకి కేవలం 1000 రూపాయలు మాత్రమే ఖర్చు అయినట్లు విద్యార్థినులు వివరించారు. పనితీరు మెరుగుపరిచేలా ఇంకా ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. అధ్యాపకురాలు డాక్టర్ ఎస్తర్ సునంద ఈ ప్రాజెక్టుకు గైడెన్స్ ఇచ్చారని అన్నారు. విద్యార్థినుల ప్రతిభను విభాగాధిపతి ఆచార్య ప్రజ్ఞ అభినందించారు.
స్మార్ట్ షూ ఇన్‌సోల్ - ఇవి వేసుకుంటే చాలు ఆరోగ్య సమస్యలు గుర్తించొచ్చు!
బాంబూ బాటిల్, ఏసీ హెల్మెట్ - వినూత్న ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్న విద్యార్థులు