Pension Distribution in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంబరంలా సాగింది. జూన్ 1న ఆదివారం కావడంతో ప్రభుత్వం ముందురోజే పింఛన్లు పంచింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం నుంచే ఇంటింటికీ వెళ్లి పించన్లు పంపిణీ చేశారు. పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు.
టీ పెట్టిన హోంమంత్రి: సామాజిక పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉద్దండపురంలో హోంమంత్రి అనిత పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ ఇంట్లో టీ కూడా పెట్టారు. అక్కడున్న చిన్నారులతో ముచ్చటించారు. మంత్రి పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరులో కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు.
లబ్ధిదారులకు అల్పహారం ఏర్పాటు: నంద్యాల పదో వార్డులో పింఛన్ లబ్ధిదారులకు మంత్రి ఫరూక్ అల్పహారం ఏర్పాటు చేశారు. కర్నూలు 48వ వార్డులో మంత్రి టీజీ భరత్ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేశారు. సంక్షేమంతోపాటు అభివృద్ధికీ సమప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన తెలిపారు.
మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని జాఫర్ సాహెబ్ కాలువ గట్టు ప్రాంతంలోని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా వీర్లగుడిపాడులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీసీ రోడ్డు ప్రారంభించి, అనంతరం పింఛన్లు అందజేశారు. ప్రకాశం జిల్లా చిలంకూరులో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేశారు. పేదల సేవకు కూటమి ప్రభుత్వం అంకితమైందని ఆయన అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్ ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పింఛన్లు పంచిన మంత్రి నిమ్మల రామానాయుడు దివ్యాంగులకు పండ్లు అందజేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పార్థసారథి పరిశీలించారు. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి పింఛన్లు అందజేశారు. పేదల ముఖంలో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని మంత్రి అన్నారు.
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు : సీఎం చంద్రబాబు
పింఛన్లు తీసుకోవడం ప్రజల హక్కు - గౌరవంగా ఇవ్వాలి: సీఎం చంద్రబాబు