Anakapalli Fire Accident : అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో చనిపోయిన ఎనిమిది మంది మృతదేహాలను అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. మిగిలివారిలో నర్సీపట్నం ఆసుపత్రిలో ఇద్దరికి, విశాఖ కేజీహెచ్‌లో నలుగురికి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది కైలాసపట్నానికి చెందిన వారు ఉండటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియల్లో గ్రామస్తులు పాల్గొన్నారు.
బాణసంచా పేలుడు ప్రాంతంలో అగ్నిమాపకశాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ పర్యటించారు. ధ్వంసమైన భవనాలను పరిశీలించి అనుమతులు, తయారీదారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ప్రతాప్ చెప్పారు. ఘటనాస్థలిలో అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బాణసంచా తయారీకి సిద్ధంగా ఉంచిన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బాణసంచాను భూమిలో పాతిపెట్టే ఏర్పాట్లు చేశారు.
అసలేం జరిగిదంటే : కైలాసపట్నానికి కిలోమీటరు దూరంలో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ పేరిట బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. ఆదివారం నాడు మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తేరుకునేలోపే భారీ పేలుళ్లు సంభవించాయి. మందుగుండు సామగ్రి నిల్వలు, తయారీకి కేటాయించిన మూడు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటి శిథిలాలు, ఇటుకలు 300 మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. షెడ్డులో బాణసంచా తయారీలో నిమగ్నమైన కార్మికులు దాడి రామలక్ష్మి, పురం పాప, గుప్పిన వేణుబాబు, సేనాపతి బాబూరావు, హేమంత్‌లు అక్కడికక్కడే మరణించారు. వీరి మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఛిద్రమయ్యాయి. మాంసపు ముద్దలపై మసి, దుమ్ము పేరుకుంది. ఘటనా స్థలికి అర కిలోమీటర్ దూరంలోని పొలంలో పని చేసుకుంటున్న ఓ రైతు ఈ విస్ఫోటాన్ని తొలుత గుర్తించి వెంటనే గ్రామస్థులకు సమాచారమిచ్చారు.
కొందరు పావుగంటలోనే అక్కడికి చేరుకున్నారు. కానీ మంటలు ఎగిసి పడుతుండటం, మధ్యమధ్య పేలుళ్లు సంభవిస్తుండటంతో సాహసించి ముందుకు వెళ్లలేకపోయారు. చివరకు కొందరు ధైర్యం చేసుకుని వెళ్లి కొన ఊపిరితో ఉన్న అప్పలకొండ తాతబాబు, సంగరాతి గోవింద్, దేవర నిర్మలను అక్కడే ఉన్న నిర్వాహకుడి వాహనంలో కోటవురట్ల సీహెచ్‌సీకి తరలించారు. కొద్దిసేపటికే ఆ ముగ్గురూ మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన 45 నిమిషాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు.
'ఆ ఎనిమిది మందికి పోస్టుమార్టం పూర్తి - పేలుడు ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు'