Anakapalli District SP press Meet on Fireworks Blast Incident : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం పేలుడు ఘటనలో గాయపడిన క్షతగాత్రులు కోలుకుంటున్నారని ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా వెల్లడించారు. ఈ మేరకు కోటవురట్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఎనిమిది మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. బాణసంచా తయారీ కేంద్రాలపై జిల్లా వ్యాప్తంగా సమగ్ర నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ బాణసంచా తయారీ కేంద్రానికి సంబంధించి వచ్చే ఏడాది వరకు అనుమతులు ఉన్నాయని అయినప్పటికీ పరిశీలన చేస్తున్నామని ఆయన వివరించారు.
పేలుడు ధాటికి భారీ శబ్దం : అనకాపల్లి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. గాయపడిన మరో 8 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. తారాజువ్వలు తయారీలో పేరొందిన బాణసంచా కర్మాగారం కావడం, పెళ్లిళ్లలో సీజన్ కావడంతో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి భారీగా శబ్దం వచ్చింది.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి : ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటించారు.
ఒక్కొక్కరికీ రూ.15లక్షలు : బాణసంచా పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్నిప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికీ రూ.15లక్షలు చొప్పున ఆయా కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు.
పొట్టకూటి కోసం పోతే ప్రాణమే పోయింది
అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి