సెలవులే లేని లైబ్రరీ : ఎప్పుడైనా వెళ్లొచ్చు - ఎంచక్కా చదువుకోవచ్చు
రూ.36 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో లైబ్రరీని అధునాతనంగా మార్పించిన కలెక్టర్ - తెలంగాణ రాష్ట్రంలోనే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న గ్రంథాలయం - సుమారు 20 వేల పుస్తకాలు లభ్యమవుతున్నట్లు వెల్లడి

Published : May 9, 2025 at 12:05 PM IST
A Library in Bhadrachalam : భద్రాచలం లైబ్రరీ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా, స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ గ్రంథాలయం అవసరాలను గుర్తించిన కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ (ఇంటిగ్రేటేడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ) పీఓ రాహుల్ గ్రామ పంచాయతీ నిధులు రూ.36 లక్షలతో అధునాతన రీడింగ్ గది, సీసీ రోడ్లు, వాష్రూమ్స్ నిర్మించారు. ప్రహరీ, సోలార్ వ్యవస్థ, ఆర్‌ఓ ప్లాంట్ అందుబాటులోకి రావాల్సి ఉంది.
పండగైనా పనిచేస్తుంది : సాధారణంగా గ్రంథాలయాలకు ప్రతి శుక్రవారం, నెలలో రెండో శనివారం, పండుగలు, ప్రభుత్వం ప్రకటించే మరేమైనా ఇతర సెలవులు వర్తిస్తాయి. రోజూ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు పనివేళలు ఉంటాయి. భద్రాచలం లైబ్రరీకి మాత్రం ఏరోజు వచ్చినా చదువుకోవడానికి వీలుంటుంది. నిత్యం ఉదయం 5 గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు లైబ్రరీ తెరిచే ఉంటుంది.
20 వేల పుస్తకాలు : చిన్న పిల్లలకు సంబంధించిన పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, నవలలు, పోటీ పరీక్షల పుస్తకాలు సుమారు 20 వేల వరుకు ఇక్కడ లభ్యమవుతాయి. లైబ్రేరియన్ మధ్యాహ్న సమయంలో భోజనానికి వెళ్లినప్పుడు కూడా వార్తా పత్రికలు, స్టడీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు రీడింగ్ విభాగంలోనే ఉండటంతో అభ్యర్థులు చదువుకునేందుకు మంచి వెసులుబాటు దొరుకుతోంది.
ఏపీలోని ఉద్యోగార్థులు సైతం : భద్రాచలం గ్రంథాలయానికి అసలు సెలవులే లేవు. నిర్ణీత సమయంలో ఇక్కడికి రావాలనే నియమమేమీ లేదు. రోజూ 100 మందికి పైగా పాఠకులు వస్తున్నారు. సెలవుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక్కడ 200 మందికి పైగా చదువుకునే అవకాశం ఉంది. ఈ గ్రంథాలయంలో చదివి గతేడాది 20 మంది వివిధ రంగాలలో ఉద్యోగాలు సాధించారు. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఏపీలోని విలీన మండలాలకు చెందిన పలువురు నిరుద్యోగులు సైతం నిత్యం ఇక్కడికి వచ్చి గంటల తరబడి చదువుకుంటున్నారు.
"ఇటీవల నాకు ప్రభుత్వ ఉద్యోగావకాశం త్రుటిలో చేజారింది. ఈసారి టీచర్ కొలువు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. ఇందుకు ఈ లైబ్రరీని వేదికగా మలచుకుంటున్నా. స్మార్ట్ ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాస్ వినాలంటే ఇందులోని వైఫై ఉద్యోగార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది" -జానీ, లైబ్రేరియన్
వేలు ఖర్చు పెట్టి స్టడీ హాళ్లకు వెళుతున్నారా? - ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ఇక్కడ చదువుకోవచ్చు
లీడ్ చిల్డ్రన్ లైబ్రరీ పేరిట గ్రంథాలయం - చదువే ఆయుధంగా విద్యార్థులకు తోడ్పడుతున్న జంట

