Amma Mata Anganwadi Bata Programme In Telangana : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్‌వాడీల పాత్ర కీలకంగా మారింది. చిన్నతనం నుంచే పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్‌లు తీవ్రమైన కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చిన్నారులను ఆకట్టుకోవడానికి, ఆటపాటలతో వారికి విద్యాబుద్దులు నేర్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుంచి అమ్మ మాట అంగన్‌వాడీ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలతో వారికి పూర్వవిద్య అందించాలన్న కార్యాచరణ రూపొందించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఎగ్ బిర్యానీతో : వికారాబాద్ పూర్తిగా వ్యవసాయంపై ఆధారిత జిల్లా. మహిళల అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. పోషకాహార లోపంతో రక్తహీనత(ఎనిమియా) కలిగిన మహిళల సంఖ్యా అధికంగానే ఉంది. ఇది పుట్టిన పిల్లలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో పిల్లల ఎదుగుదల, పోషణపై ప్రభుత్వం దృష్టి సారించింది. మాతా, శిశుమరణాల రేటును వేగంగా తగ్గించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా చిన్నారులకు భోజనంలో గుడ్డు తల్లులు, గర్భిణులకు భోజనం వడ్డించేది.
ప్రభుత్వమే సరఫరా : కొత్తగా ఈ నెల 17వ తేదీ వరకు చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎగ్ బిర్యానీని పెడుతున్నారు. సన్నబియ్యం, మంచినూనె, గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా వాటిలోకి అవసరమైన నిత్యావసరాలను అంగన్‌వాడీ టీచర్లు కొంటున్నారు. పోషకాహారాన్ని అందిస్తూ పసిమనసులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకు ముందు వరకు ప్రతి సోమ, బుధ, గురువారాల్లో గుడ్డుతో చేసిన కూర చేసేవారు. ఇప్పుడు బిర్యానీతో మరిన్ని పోషకాలు అందేలా చూస్తున్నారు. బిర్యానీని కనీసం వారానికోసారి అందించేలా సర్కారు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
"పోషకాహార లోపాన్ని నివారించాలన్న ఉద్దేశంతోనే అంగన్‌వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. వేలాది మంది చిన్నారులు, తల్లులు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని చాలా విజయవంతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనివల్ల చాలా వరకు గ్రామీణ ప్రాంత మహిళల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడ్డాయి. రెండున్నరేళ్లకు పైబడి వయసున్న చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పిస్తున్నాం" -డా.పి.జయసుధ, మహిళా శిశు, సంక్షేమాధికారిణి, జిల్లా ఇన్‌ఛార్జి