Ambulance Staffer Saves Newborn Baby : ప్రసవవేదనతో అల్లాడుతున్న గర్భిణి పైగా అర్ధరాత్రి సమయం. ఎలాగోలా అంబులెన్స్‌లో ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. కానీ మార్గమధ్యంలో సీరియస్‌గా ఉండటంతో కాన్పు చేయాల్సి వచ్చింది. కానీ పుట్టిన బిడ్డ కదలికలు లేకపోవడంతో అంతా రోదించారు. వెంటనే 108 సిబ్బంది చివరి ఆశగా సీపీఆర్ చేయడంతో పసిగుడ్డులో కదలికలు మొదలై ఒక్కసారిగా కెవ్వుమని గట్టిగా ఏడవటం ప్రారంభించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా సంతోషంగా నవ్వుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని బండమీదిపల్లిలో శనివారం జరిగింది.
కర్ణాటక సరిసద్దులోని పెద్దేముల్ మండలంలోని బండమీది పల్లి గ్రామానికి చెందిన మాల కిష్ణప్ప, నాగమ్మకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టి నెల రోజులకే చనిపోయింది. రెండోసారి గర్భం దాల్చాక వైద్యులను సంప్రదిస్తే, ఈసారి కూడా కాన్పు కష్టంగా ఉండవచ్చని తెలిపారు. శనివారం అర్ధరాత్రి ఆమెకు ఒక్కసారిగా పురుటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు.
ఒక కాలు బయటికి రావడంతో : ఈ క్రమంలో నాగమ్మను తాండూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళుతుండగా తట్టేపల్లి వద్ద పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. శిశువు ఒక కాలు మాత్రమే బయటికి రావడంతో పరిస్థితి విషమంగా మారింది. వెంటనే 108 సిబ్బంది వాహనాన్ని ఆపేసి ఈఎంటీ నర్సిములు నాగమ్మకు చికిత్స చేశాడు. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడి వరకూ అంతా బాగున్నా జన్మించిన శిశువులో మాత్రం ఎలాంటి చలనం లేదు. అక్కడి వారు రోధించారు. ఇదే ఆఖరి ఛాన్స్‌గా భావించి నర్సిములు బిడ్డకు సీపీఆర్ చేయడం ప్రారంభించారు. పసిబిడ్డ నోటి నుంచి ఉమ్మనీరు తీస్తూ సీపీఆర్ చేశారు. కొద్ది నిమిషాల్లోనే బిడ్డలో కదలిక వచ్చి కెవ్వుమని ఏడవడం ప్రారంభించాడు. దీంతో అక్కడి వారిలో ముఖాల్లో ఆనందం కనిపించింది. తల్లీబిడ్డలను వైద్యపర్యవేక్షణ కోసం తాండూరు మాతాశిశు ఆసుపత్రిలో చేర్పించారు.
కాంగ్రెస్ నేతకు అకస్మాత్తుగా గుండెపోటు - సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే
చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు - సీపీఆర్ చేసి ప్రాణం నిలబెట్టిన అంబులెన్స్ డ్రైవర్