Amaravati Women Attack on Sakshi Office: అమరావతి రాజధానిని, ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. గత ఐదేళ్లూ మహిళలను అనేక ఇబ్బందులకు గురిచేసిన వైఎస్సార్సీపీ, ఆ పార్టీ ఛానల్ సాక్షి ఇప్పుడూ అదే పంథా కొనసాగిస్తోందని మహిళలు ధ్వజమెత్తారు. ఘటనపై జగన్, ఆయన భార్య భారతీరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని మండిపడ్డారు. భారతీరెడ్డిపై విమర్శలు చేసిన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకున్న కూటమి ప్రభుత్వం, కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయట్లేదని నిలదీశారు.
అమరావతి మీద మొదటి నుంచి విషం చిమ్ముతున్న సాక్షి, ఇప్పుడూ ప్రణాళిక ప్రకారం రాజధాని మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేయించిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి అంబేడ్కర్ కూడలిలో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలను తగలబెట్టారు. అనంతరం మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, మందడం, తాడికొండతో పాటు ఇతర ప్రాంతాల్లో మహిళలు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
సాక్షి టీవీ చర్చా వేదికలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేనిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే తుళ్లూరులో రాజధాని రైతుల ఐకాస నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. జగన్ హయాంలో మహిళలపై దాడులు చేసినా ఓర్పుతో సహించామని, ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా రాజధాని మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు: అమరావతి ప్రాంత మహిళలు, తెలుగు మహిళ, యువత, టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయం ముట్టడికి యత్నించారు. అసభ్య పదాలు వాడినప్పటికీ పశ్చాత్తాపంతో క్షమాపణలు చెప్పకపోగా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ సాక్షి యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం బోర్డును పీకేశారు. కోడిగుడ్లు విసిరారు. లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం గేటుకు తాళం వేసి నిరసనకు దిగారు. సాక్షిని అడ్డం పెట్టుకుని మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఏలూరులోని సాక్షి ఆఫీసు వద్ద టీడీపీ మహిళా నేతలు ఆందోళనకు దిగారు. విశాఖ అక్కయ్యపాలెంలోని సాక్షి కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. కార్యాలయాన్ని ముట్టడించి నినాదాలు చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెలుగు మహిళ నియోజకవర్గ కన్వీనర్ బొగ్గు అర్చన ఆధ్వర్యంలో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియా రాజధాని మహిళలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎచ్చెర్లలో టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ఎచ్చెర్లలోని సాక్షి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన నేతలు, ప్రహరీ గోడపై ఎక్కి ఆందోళన చేశారు. మహిళలను కించపరిచి ఇంటికి వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను ఇంట్లో ఆడవాళ్లు నిలదీయాలని, లేకపోతే వారికీ ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని మహిళలు పేర్కొన్నారు.
అమరావతిపై అక్కసుతోనే: జర్నలిస్టు కృష్ణంరాజును వెంటనే అరెస్టు చేయాలంటూ తిరుపతి జిల్లా చంద్రగిరిలో తెలుగు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమ్మినేని, కృష్ణంరాజుపై కఠిన చర్యలు కోరుతూ టీడీపీ నేతలు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కర్నూలు సాక్షి కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సాక్షి ప్రతులను తగులబెట్టారు. సాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడప సాక్షి ఆఫీసు వద్ద తెలుగు మహిళలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. గేటు వద్ద పార్టీ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేశారు. సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతిపై అక్కసుతోనే ఇలాంటి వాటిపై డిబేట్ పెట్టి ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.