AMARAVATI NEW SECRETARIAT BUILDING: అమరావతిలో కొలువుదీరే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు ఇందులో ఉంటాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాదిరే ఈసారి కూడా మూడు ప్యాకేజీల కింద విభజించారు. 4,688.82 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. నాన్- ఎస్‌ఓఆర్ ధరలను ఇటీవలే ఖరారు చేయడంతో టెండర్లను ఆహ్వానించారు. వచ్చే నెల 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడువు నిర్దేశించారు.
బిడ్లను అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారు. ఐకానిక్ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2,703 కోట్లతో టెండర్లను పిలిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైఖరి కారణంగా ఇప్పుడు అంచనా వ్యయం 73% పెరిగింది. ప్రస్తుతం మొదటి ప్యాకేజీ కింద 1,126.51 కోట్ల రూపాయలతో జీఏడీ టవర్, రెండో ప్యాకేజీలో 1,897.86 కోట్ల రూపాయలతో రెండు టవర్లు, మూడో ప్యాకేజీ కింద 1,664.45 కోట్ల రూపాయలతో మరో టవర్లను నిర్మించనున్నారు.
డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం:
- ఐకానిక్ టవర్లను డయాగ్రిడ్ విధానంలో ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది.
- ఏపీలో తొలిసారిగా డయాగ్రిడ్ టెక్నాలజీని రాజధాని అమరావతిలో వినియోగిస్తున్నారు.
- డయాగ్రిడ్ నమూనాతో నిర్మించనున్న ఈ ఐకానిక్ టవర్లకు ఎక్కువ స్టీల్, ఇతర సామగ్రిని వినియోగించాల్సి ఉంటుంది.
- గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధమైన టెక్నాలజీతో ఆకృతులతో నిర్మాణాలు చేపట్టలేదు.
- అన్నింటి కంటే ఎత్తుగా నిర్మించనున్న జీఏడీ టవర్ బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా వీటిని నిర్మించనున్నారు.
- ఇందులోనే సీఎం ఆఫీసు రానుంది. దీని టెర్రస్‌పై ముఖ్యమంత్రి ప్రయాణాల కోసం హెలిప్యాడ్ సైతం నిర్మించనున్నారు.
- మిగిలిన 4 టవర్లనూ 39 అంతస్తులుగా నిర్మిస్తారు.
- అమరావతిలో ఐకానిక్ టవర్లను మొత్తం 68.88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
60,000 టన్నుల స్టీల్‌తో నిర్మాణాలు: ఐకానిక్ టవర్ల డిజైన్ కోసం దాదాపు 60 వేల టన్నుల స్టీల్ అవసరమవుతుంది. దీని కోసం సీఆర్‌డీఏ అధికారులు ఇటీవల రాయగడలోని స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. దీంతోపాటు కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని జిందాల్ ప్లాంట్, తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఎవర్ సెండే కంపెనీకి చెందిన వర్క్‌షాపులను సైతం అధికారులు పరిశీలించారు. రాయగడలో స్టీల్ కొనుగోలుచేసి, దానిని బళ్లారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయాల్సి ఉంది. అక్కడి నుంచి అమరావతికి తరలించి, ఐకానిక్ టవర్ల నిర్మాణంలో వినియోగించనున్నారు.
అమరావతి పునర్నిర్మాణ పనులు - మే 2న రాష్ట్రానికి మోదీ
రాజధాని అమరావతికి మరో 30 వేల ఎకరాలు
ముస్తాబవుతున్న ఏడంతస్తుల మేడ - ఇక్కడి నుంచే రాజధాని పనుల పర్యవేక్షణ