Amar Raja Lithium Ion Battery Manufacturing Industry : పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో ప్రస్తుత కాలంలో ఉద్యోగం దొరకడమే చాలా కష్టం. ఒకవేళ దొరికినా చాలీచాలనీ వేతనాలు. ఇక మహిళలకైతే ప్రాధాన్యం తక్కువ. కానీ ఆ పరిశ్రమలో మాత్రం 98 శాతం మంది ఉద్యోగులు మహిళలే. ఒకప్పుడు దినసరి కూలీలుగా, గృహిణులుగా ఉన్న మహిళలు, ఇప్పుడు ఓ పరిశ్రమ నడపడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోని అమర్‌రాజా లిథియం అయాన్ బ్యాటరీ తయారీ పరిశ్రమ వారి జీవితాల్ని మలుపు తిప్పింది. మహిళా సాధికారతకు తమదైన శైలిలో బాటలు వేస్తోంది.
98 శాతం మహిళలే : ఏ రంగంలో చూసినా, ఏ పరిశ్రమలో చూసినా మహిళలతో పోల్చితే పురుషుల సంఖ్యే అధికం. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో 98 శాతం మహిళా ఉద్యోగులతో బ్యాటరీ ప్యాకింగ్ యూనిట్‌నే నడుపుతోంది అమర్‌రాజా. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం దివిటిపల్లిలోని అమర్‌రాజా గిగా ఫ్యాక్టరీలో 98 శాతం మంది మహిళలే పని చేస్తున్నారు.
బ్యాటరీ ప్యాకింగ్ యూనిట్‌లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ అంతా మహిళలే. మొదట్లో పరిశ్రమలో పని చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కేవలం 10 మందితో మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. పని విధానం, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ భద్రత, మహిళలకు ప్రాధాన్యాన్ని చూసి క్రమంగా ఉద్యోగుల సంఖ్య 350కి చేరింది. భవిష్యత్‌లో ఈ సంఖ్యని వెయ్యికి చేర్చాలని భావిస్తోంది అమర్ రాజా.
గృహిణులు, చిరు ఉద్యోగులు : ప్యాకింగ్ యూనిట్‌లో పని చేస్తున్న వారంతా మొదట్లో ఎలాంటి వృత్తి నైపుణ్యాలు లేని వాళ్లే. పదో తరగతి, ఇంటర్ పాసై చదువులు ఆపేసి కూలీనాలీ చేసుకునే వారు కొందరైతే, గృహిణులుగా, చిరు ఉద్యోగులుగా పని చేసిన వారు మరికొందరు. ఏ పని చేసినా వారందుకున్నది నెలవారి 10 వేలలోపే. అలాంటిది ప్రస్తుతం రూ.15 వేల కనీస వేతనంతో అమర్‌రాజాలో ఉద్యోగాన్ని మొదలుపెట్టారు. దివిటిపల్లి సహా చుట్టు పక్కల ప్రాంతాల వారికే ప్రాధాన్యం కల్పించారు.
ప్రత్యేక శిక్షణతో ఉద్యోగాలు : చిత్తూరులోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో పని విధానం, నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం ఐదు బృందాలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని యూనిట్ నిర్వహణలో రాణిస్తున్నాయి. ఉద్యోగులకు ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యాలు కల్పించారు. పరిశ్రమలో పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు మాత్రమే కాదు, పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్య పరిరక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి వాటిపైనా శిక్షణ అందిస్తున్నారు. తద్వారా కిందిస్థాయిలో పని చేసిన పరిశ్రమలోనే. ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు కల్పించాలనేదే ఉద్దేశం.
తక్కువ శ్రమతో మహిళల పని : అమర్‌రాజాకు మహిళలతో యూనిట్‌ను నడపటం కొత్తేమీ కాదు. అమర్‌రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 85 శాతం ఉద్యోగులను మహిళల్ని నియమించి అక్కడ విజయం సాధించారు. చిత్తూరు యూనిట్‌లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ మోడల్‌లే ప్రస్తుతం దివిటిపల్లిలో అమలు చేస్తున్నారు. ఆటోమేషన్‌తో పనిచేసే యూనిట్ కావడంతో తక్కువ శ్రమతో కూడిన పనిలో మహిళలకు అవకాశం ఇవ్వొచ్చని తొలుత భావించారు. కానీ కఠినమైన శ్రమతో కూడిన విభాగాల్లోనూ ఆడవాళ్లే పని చక్కబెడుతున్నారు. ముడిసరుకు తనిఖీ, అసెంబ్లీ, టెస్టింగ్, వెల్డింగ్, డిస్పాచింగ్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు అవకాశం కల్పిస్తే. మారుమూల ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందంటోంది అమర్ రాజా.
యూనిట్ మొత్తంలో మహిళల్నే నియమించడంపై అక్కడి ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో పోల్చితే ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోరని నిరూపించేందుకు ఆ యూనిట్ ఓ మోడల్‌గా నిలిచిందంటున్నారు. పరిశ్రమలో చేరాక ఆర్థిక క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాలు, పొదుపు అన్ని అలవడ్డాయని మహిళలు ఆనందంగా చెబుతున్నారు.
2025లో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు- రూ.లక్షల్లో సంపాదన, పొదుపు!
వీ ఫర్ ఉమెన్ ఎంపవర్‌మెంట్- మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు- నెలకు రూ.40 వేల ఆదాయం!