Allagadda Rural SI Demand Money From Tractor Driver : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలు, అవినీతికి అడ్డు లేకుండా చెలరేగి విమర్శలు ఎదుర్కోగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారిలో మార్పు కనిపించడం లేదు. అవినీతికి అలవాటుపడిన ఆళ్లగడ్డ పోలీస్ అధికారి ఇసుక ట్రాక్టర్ వదిలి పెట్టాలంటే 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అంత ఇచ్చే స్తోమతలేని ట్రాక్టర్ డ్రైవర్ జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో విడుదల చేసి కడప జిల్లాలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన పోలీసుశాఖలో గుబులు రేగుతోంది.
లంచావతారం: కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చెన్నంరాజుపల్లెకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఇసుక రీచ్ నుంచి ఇసుక రవాణ చేస్తున్నాడు. శుక్రవారం రీచ్ నుంచి ట్రాక్టర్లో ఇసుక తరలిస్తుండగా ఆళ్లగడ్డ గ్రామీణ ఎస్ఐ ప్రసాద్ పట్టుకున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నాడని భావించి ట్రాక్టర్‌ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాడు. తప్పుంటే కేసు నమోదు చేయాల్సిన పోలీసు అధికారి ట్రాక్టర్ డ్రైవర్‌తో లాలూచీ వ్యవహారం నడిపాడు. ట్రాక్టర్ వదిలి పెట్టాలంటే 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు తన వద్దలేని ప్రాధేయపడినా వినలేదు. డబ్బు ఇవ్వకుంటే ట్రాక్టర్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఎస్ఐ తేల్చిచెప్పాడు.
వేడుకున్నా కనికరం లేదా: ప్రొద్దుటూరులో తన పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని, ట్రాక్టర్ ఇసుకను తీసుకెళ్తే 5 వేల రూపాయలు వస్తాయని, ఆ డబ్బులతో వైద్యం చేయించాలని అనుకున్నానని డ్రైవర్ తెలిపాడు. కానీ అవేమీ పట్టించుకోని ఎస్ఐ రూ. 20 వేలు కావాలని భీష్మించాడు. గత్యంతరం లేని డ్రైవర్ రవీంద్ర తనకు తెలిసిన వాళ్ల నుంచి అప్పటికప్పుడు 10 వేల రూపాయలు తన ఖాతాకు బదిలీ చేయించుకుని తర్వాత ఎస్ఐకి పోన్ పే ద్వారా 10 వేల రూపాయలు పంపాడు. ఇంకా పదివేలు ఇవ్వాలని పోలీసు అధికారి పట్టుబట్టాడు. ఇక తనవద్ద లేదని కాళ్లా వేళ్లా పడ్డా కనికరం చూపలేదు. తీవ్ర మనస్థాపం చెందిన డ్రైవర్ ట్రాక్టర్ వదిలిపెట్టి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చే క్రమంలో సెల్ఫీ వీడియో తీసి విడుదల చేశాడు.
ఆత్మహత్యాయత్నం: ఆళ్లగడ్డ ఎస్ఐ ఇసుక ట్రాక్టర్ పట్టుకుని వదిలిపెట్టాలంటే 20 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సీఎం, డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేస్తూ వేడుకున్నాడు. 24 గంటల్లో తన ట్రాక్టర్ వదిలిపెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో ప్రకటించాడు. అన్నట్లుగా ఇవాళ తెల్లవారుజామున కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు..
''చాగలమర్రి టోల్గేట్ దగ్గర ఇసుక ట్రాక్టర్‌తో వెళ్తుంటే నన్ను ఎస్సై హరిప్రసాద్ అడ్డుకున్నారు. తరువాత 20 వేల రూపాయలు ఇవ్వాలని ఎస్ఐ డిమాండ్ చేశాడు. నా కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్లో ఉన్నాడని చెప్పినప్పటికీ కొంచెం కూడా కనికరం లేకుండా ఇసుక ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించారు. చివరికి చేసేదేం లేక పది వేల రూపాయలు ఫోన్ పే చేశాను. మిగిలిన 10 వేల రూపాయలు ఇస్తేనే ట్రాక్టర్‌ను విడిచి పెడతానని ఎస్సై నన్ను బెదిరించాడు. ఇప్పుడు నాకు ేరే గత్యంతరం లేదు. అందుకే నా ట్రాక్టర్ వెనుకకు రాకపోయినట్లయితే నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను''- రవీంద్ర, ఇసుక ట్రాక్టర్ డ్రైవర్, వైఎస్సార్ జిల్లా
రాజీయత్నాలు: ట్రాక్టర్ డ్రైవర్ సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్యకు యత్నించాడనే విషయం మీడియాలో ప్రసారం కావడంతో పోలీస్ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఆళ్లగడ్డ పోలీసు అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం. యర్రగుంట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రవీంద్రను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పోలీసులు రాజీ ప్రయత్నాలు చేస్తుండటంతో బాధిత కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పడానికి జంకుతున్నారు.
'ప్రేమించిన అమ్మాయికి ఉద్యోగం' - తను కుటుంబానికి ఏమీ చేయలేకపోతున్నానని మనస్థాపం