All India Coordinated Research on Tuber Vegetables : దుంప కూరగాయల సాగు అన్నివిధాలా రైతులకు లాభదాయకమని, ఆదాయార్జనతో పాటు ఉపాధి, ఎగుమతి అవకాశాలు లభిస్తాయని, పోషకాహార భద్రతకు ఊతమిస్తుందని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 40 రోజుల్లో వచ్చే పంటతో ముగ్గురు సభ్యులుండే కుటుంబం సగటు ఆదాయం నెలకు రూ.13,000-15,000 వస్తుందన్నారు. అదే 120 రోజుల్లో పండే వరి, ఇతర పంటల ఆదాయం రూ.3 నుంచి రూ.4 వేలే ఉంటుందని చెప్పారు.
దుంప కూరలపై హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధన, కేంద్రం, కేరళ దుంప కూరగాయల పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో అఖిల భారత పంటల సమన్వయ పరిశోధన పథకం 25వ వార్షిక గ్రూప్ సదస్సు సోమవారం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి దండా రాజిరెడ్డి అధ్యక్షత వహించగా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే, త్రివేండ్రం కేంద్రీయ దుంప కూరగాయల పరిశోధన స్థానం డైరెక్టర్ జి.బైజు, అటారి డైరెక్టర్ షేక్ ఎన్.మీరా, 21 రాష్ట్రాల్లోని 50 మంది పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

దుంప పంటల ప్రాధాన్యాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. ప్రపంచంలో వరి, అపరాల తర్వాత దుంప కూరగాయలది మూడో స్థానమని, ఇప్పటికే అధిక దిగుబడి, ఉత్పాదకత గల 155 రకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 'పంట ఉత్పత్తుల నిల్వ అవకాశాలు పెంచడంతో పాటు రైతుల ఉత్పత్తి సంఘాలతో అనుసంధానం చేసి, దేశంలోని ప్రతి పట్టణం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో దుంప కూరగాయల సాగును ప్రోత్సహిస్తే వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. పంటల బ్రాండింగ్, మెరుగైన మార్కెటింగ్ కోసం స్వయం సహాయక బృందాలతో కలిసి పనిచేయాలి' అని సూచించారు.
10కిలోల గుమ్మడి- 7అడుగుల పొట్లకాయ- రైతు మేళాలో భారీ సైజ్ కూరగాయలు