అక్కమహాదేవి గుహల స్టే ప్యాకేజీ వచ్చేసింది - ధర తక్కువే - ఆన్‌లైన్‌లో ఇప్పుడే బుక్ చేసేయండి
అక్కమహాదేవి గుహల స్టే ప్యాకేజీ ప్రారంభించిన ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ - రెండు రోజుల పర్యటన - ఆన్‌లైన్‌లో బుకింగ్

Published : January 14, 2025 at 9:57 AM IST
Akka Mahadevi Caves Stay Package : ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు మరో పర్యాటక ప్రదేశం అందుబాటులోకి వచ్చింది. దోమలపెంట అక్కమహాదేవి స్టే ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆన్‌లైన్‌లో బుకింగ్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణా తీరాన ఉన్న అక్కమహాదేవి గుహలు దోమలపెంట స్టే ప్యాకేజీని అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ప్రారంభించారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న గుహల సందర్శన పర్యాటకులకు మధురానుభూతిని మిగల్చుతుంది. 2 రోజులు సాగే ప్యాకేజీ కోసం పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటి రోజు ఇలా : దోమలపెంట అక్కమహాదేవి పర్యటనలో మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు దోమలపెంట అటవీ శాఖ ఆఫీస్ వద్ద ఉన్న వనమయూరి అతిథి గృహంలోని బుక్ చేసుకున్న రూమ్‌కి చేరుకోవాలి. అనంతరం పర్యాటకులను దోమలపెంట దగ్గరలోని వజ్రాల మడుగు, ఆక్టోపస్ వ్యూపాయింట్లకు వాహనాల్లో తీసుకెళ్తారు. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత నైట్ భోజనం తీసుకుని విశ్రమిస్తారు.
రెండో రోజు ఇలా : మరుసటి రోజు మార్నింగ్ 6 గంటలకు పర్యాటకులను అక్కమహాదేవి గుహలకు వెళ్లే మార్గానికి వాహనాల్లో తీసుకువెళ్తారు. శ్రీశైలం ప్రధాన రోడ్ నుంచి దాదాపు 5 కిలో మీటర్ల దూరంలోని అక్కమహాదేవి గుహలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ మార్గంలో కనిపించే పక్షులు, జంతువులు, వివిధ రకాల వృక్షాల గురించి గైడ్‌లు పూర్తిగా వివరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అతిథి గృహానికి చేరుకోవటంతో ఈ పర్యటన ముగుస్తుంది.
వసతి సౌకర్యాలు : పర్యటన ప్యాకేజీలో భాగంగా పర్యాటకులకు ఉదయం అల్పాహారం, రాత్రి బస, భోజనం, ఆక్టోపస్ దృశ్యకేంద్రం, వజ్రాల మడుగు, అక్కమహాదేవి గుహల గేటు వద్దకు వాహనం సౌకర్యం కల్పిస్తారు. పర్యాటకులు ఎంపిక చేసుకునే రూమ్ రకాన్ని బట్టి రూ.6,500 నుంచి రూ.8,000 వరకు వసూలు చేస్తారు. రూమ్‌కి ఇద్దరిని చొప్పున అనుమతిస్తారు. ఇంకో వ్యక్తిని అనుమతించాలంటే అదనంగా రూ.1,700 చెల్లించాలి.
నల్లమల సిగలోని ప్రకృతి అందాలను చూసొద్దాం రండి!
ఇకపై రోడ్డు మార్గంలోనే అక్కమహాదేవి గుహకు - ఈ సెలవుల్లో ప్లాన్ చేయండి!

