Air Pollution Due To Chalk Dust on National Highways : జాతీయ రహదారిపై నాపరాయి వ్యర్థాలు, సుద్దతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యాల బారిన పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.
తాండూరు నియోజకవర్గంలో వెయ్యికిపైగా నాపరాయి పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తాండూరు మండలం చెంగోల్, అల్లాపూర్, గౌతాపూర్, గోపన్‌పల్లి, అంతారం, చెంగెష్‌పూర్, కోనాపూర్, సిరిగిరిపేట, కోకట్, పట్టణ శివారు అయ్యప్పనగర్, హసేన్‌నగర్, హైదరాబాద్ రోడ్డు, ఎన్టీఆర్ కాలనీల్లో కొనసాగుతున్నాయి. వాటిలో రాత్రింబవళ్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
నాపరాయిని నునుపు చేసే క్రమంలో ద్రవరూప సుద్ద, కొలతల ప్రకారం కోసేటప్పుడు చిన్న ముక్కలు వ్యర్థాలుగా మిగులుతున్నాయి. ద్రవరూప సుద్ద ఎండిన తరవాత జాతీయ రహదారి వారగా ఉన్న దుకాణ సముదాయాల ఎదుట, పరిశ్రమలు, వేబ్రిడ్జిల దగ్గర ఎర్రమట్టికి ప్రత్యామ్నాయంగా వేస్తున్నారు. వాహనాలు రహదారి కిందికి వెళితే ఒక్కసారిగా సుద్ద పొడి లేచి పొగమంచును కురిసినట్లు కనిపిస్తోంది. నాపరాయి ముక్కలను చెంగెష్‌పూర్, కోనాపూర్, అల్లాపూర్, కరణ్‌కోట రహదారుల పక్కన పారబోస్తున్నారు.
ముసుగులు ధరించి ప్రయాణించాల్సిన పరిస్థితి : పరిశ్రమలకు ఓగీపూర్, మల్కాపూర్, కరణ్‌కోట, కోటబాస్పల్లి గనుల నుంచి నిత్యం 300కుపైగా లారీల్లో నాపరాళ్లను తీసుకెళ్తున్నారు. లారీలు గనుల నుంచి తెచ్చిన నాపరాళ్లను పరిశ్రమల వద్ద ఖాళీ చేసి జాతీయ రహదారి మీదుగా తిరిగి వెళ్తున్నాయి. వాస్తవానికి ఖాళీ చేశాక లారీలను నీటితో శుభ్రం చేసి రోడ్డెకాల్సి ఉంటుంది. లారీ డ్రైవర్లు, పరిశ్రమల నిర్వాహకులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. నాపరాళ్లను ఖాళీ చేయగానే రయ్‌మంటూ రహదారిపైకి చేరుతున్నారు. దీంతో దుమ్ము లేస్తోంది. కొంత సేపయ్యాక ఆరిపోతుంది. వాహనాల రాకపోకలతో పెద్దఎత్తున కాలుష్యం ఏర్పడుతోంది. వాహనదారులు ముసుగులు ధరించి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
జాతీయ రహదారిపై రోజూ 5 వేలకుపైగా వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారిపై దుమ్ము కళ్లలోకి, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుండగా చర్మ, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కంటిచూపుపై ప్రభావం పడుతుండగా శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు.
ఊపిరి పీల్చేదెలా? - కలుషిత గాలులతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి
ఓవైపు చలి - మరోవైపు కాలుష్యం - హైదరాబాద్‌లో ఆరోగ్యం 'గాలి'లో దీపమేనా?