Visakha Metro Rail Project Updates : విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను మెట్రో రైల్ అధికారులు, ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులు ఇవాళ పరిశీలించారు. ఈ క్రమంలో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వరకు ఉన్న అన్ని మెట్రో స్టేషన్ల కోసం నిర్దేశిత ప్రాంతాలను పరిశీలించినట్లు తెలిపారు . 46.23 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 43 స్టేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. మొదటి దశకు సుమారు రూ.11,000ల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు ఎండీ రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
మూడు కారిడార్లు 42 స్టేషన్లు : విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును మూడు కారిడార్లలో 46.22 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లతో నిర్మించాలన్నది అధికారుల ఆలోచన. ఇందులో భాగంగా స్టీల్‌ప్లాంట్-కొమ్మాది కూడలి వరకు 34.40 కిలోమీటర్లలో 29 స్టేషన్లు రానున్నాయి. గురుద్వారా నుంచి పాతపోస్టాఫీసు వరకు 5.07 కిలోమీటర్లలో 6 స్టేషన్లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.75 కిలోమీటర్లలో 7 స్టేషన్లు ఉండనున్నాయి.
ఇటీవలే ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ప్రతినిధులు విజయవాడలో మొదటి దశలో చేపట్టనున్న 2 కారిడర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గన్నవరం నుంచి పీఎన్‌బీఎస్, పెనమలూరు నుంచి పీఎన్‌బీఎస్ వరకు 2 గంటలపాటు పర్యటించి అక్కడ ఏయే ప్రాంతాల్లో రద్దీ ఎలా ఉందని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలానే మరికొన్ని బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. సంప్రదింపుల తర్వాత వీటిపై నివేదికను తయారుచేసి కేంద్రానికి పంపనున్నారు. రుణానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనున్న దృష్ట్యా ఆమోదం తప్పనిసరి.
Vijayawada Metro Rail Updates : విజయవాడలో రానున్న మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో రెండు కారిడర్లను నిర్మించనున్నారు. 25.90 కిలో మీటర్లతో గన్నవరం విమానాశ్రయం నుంచి పీఎన్‌బీఎస్ వరకు ఒకటి, అదే విధంగా పెనమలూరు నుంచి పీఎన్‌బీఎస్ వరకు 12.50 కిలో మీటర్ల పొడవుతో మరొకటి రానున్నాయి. ఈ రెండు మార్గాల్లో మొత్తం 33 స్టేషన్లను ప్రస్తుతానికి ప్రతిపాదనలు చేశారు. మెట్రో స్టేషన్లను ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌తో అనుసంధానం చేయనున్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నుంచి అన్ని ముఖ్య ప్రాంతాలకు వెళ్లేలా సిటీ బస్సు సర్వీసులను నడపనున్నారు.
ఇక జెట్ స్పీడ్‌లో విశాఖ మెట్రో - జనరల్ కన్సల్టెన్సీ కోసం బిడ్ల ఆహ్వానం
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ అప్డేట్ - సీఎంపీ కోసం కేంద్రం నిధులు