ట్రాఫిక్‌లో ఏఐ కెమెరాలు - కంట పడితే అంతే, తప్పించుకునే అవకాశమే లేదు
కంట పడితే ఇక అంతే! - తొలిసారిగా తూప్రాన్‌లో ఏర్పాటు - పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఏఐ కెమెరాలు

Published : August 4, 2025 at 7:26 PM IST
AI Traffic Cameras First Installed in Toopran : తూప్రాన్‌లో తొలిసారిగా నేరాల నియంత్రణలో భాగంగా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా పట్టణంలో ఒక్కోదానికి రూ.1.50 లక్షలు వెచ్చించి తొమ్మిది కెమెరాలను బిగించారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వినియోగంలోకి తీసుకొచ్చారు.
పురపాలిక నిధులు రూ.6 లక్షలు, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా రూ.7.50 లక్షలు నిధులు సమీకరించారు. త్వరలోనే మెదక్ జిల్లాలోని మరిన్ని పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలోనూ తూప్రాన్ పట్టణంలోని పలు కాలనీల్లో సుమారు రూ.2 కోట్లతో వివిధ రకాల కెమెరాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం అవి వినియోగంలో ఉన్నాయి.

తప్పించుకునే అవకాశమే లేదు : ఏఐ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లలోని సంఖ్యను స్పష్టంగా (చీకట్లో అయినా కూడా) కనిపెడుతోంది. వాహనం నంబరు కొడితే వాహనం ఆ కెమెరాలో ఎన్నిసార్లు నిక్షిప్తం అయిందో కూడా పసిగడుతోంది. అలాగే ఎంత మంది ప్రయాణిస్తున్నారో గుర్తిస్తోంది. ఫలితంగా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో నిందితులు ఇకపై తప్పించుకునే అవకాశమే లేదు. మొదట్లో తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన నాలుగు కెమెరాల పనితీరు బాగుండడంతో, మళ్లీ నూతనంగా నర్సాపూర్ చౌరస్తా, పోతరాజ్‌పల్లి కమాన్, నాగులపల్లి వంతెనతో పాటు రెండు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని అమర్చారు.
''కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ఏఐ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. మొదటగా తూప్రాన్‌లో నాలుగు కెమెరాలు ఏర్పాటు చేశాం. ఫలితం కనిపించడంతో దాతల సహాయంతో మరో అయిదు అమర్చాం. నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాం. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.'' - శివానందం, ఎస్సై, తూప్రాన్

ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది ?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక దిశ నుంచి వచ్చే వాహనాల సంఖ్య పెరిగితే, ఆ వైపు సిగ్నల్ వెంటనే ఏఐ వ్యవస్థ ద్వారా ఎక్కువసేపు ఆకుపచ్చ రంగులో మారుతుంది. ఆ తర్వాత ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా సిగ్నల్ లైట్లు ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. దీనివల్ల రోడ్డుపై ప్రయాణ సమయాన్ని 28 నుంచి 48 శాతం తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్రయాణ వేగం 62 శాతం పెరుగుతుందంటున్నారు.
- సిగ్నల్ లైట్ ఎరుపు రంగులో ఉన్నప్పుడు వాహనదారులుగా ఆగాలి.
- ఆకుపచ్చగా ఉన్నప్పుడు వెళ్లాలి.
- ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ సహాయంతో సిగ్నల్ దాటడం, సీట్ బెల్డ్ ధరించకుండా వాహనం నడపడం, ఓవర్ స్పీడ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసు నమోదు చేస్తారు.
- ఆ తర్వాత చలాన్ వాహనదారుల ఫోన్‌కు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.
- దీని ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడానికి ప్రయత్నించే డ్రైవర్ వాహన నంబర్ ప్లేట్‌ను నేరుగా స్కాన్ చేస్తుంది.
- లేదంటే ట్రాఫిక్ ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు పడతాయి.
- అక్కడి పరిస్థితిని బట్టి రోడ్డుపై వాహనాల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఏఐ వ్యవస్థ స్వయంచాలకంగా పని చేస్తుంది.
ఏఐ వచ్చాక కొత్త ఉద్యోగాల సృష్టి - ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ

