అమ్మాయిని దత్తత తీసుకోవడానికే 'సై' - రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న గర్ల్ చైల్డ్ అడాప్షన్
రాష్ట్రంలో పెరుగుతున్న అమ్మాయిల దత్తత - అమ్మాయిలనే తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్న దంపతులు - నాలుగేళ్లలో 35మంది దత్తత

Published : July 4, 2025 at 4:01 PM IST
Girl Child Adoption Increasing in Telangana : ఆడపిల్లలు ఉన్న ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. అందుకే కంటే కుమార్తెనే కనాలిరా అంటూ ఓ సినీ రచయిత అమ్మాయి ప్రాధాన్యాన్ని పాటలో వివరించారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన వారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇటు చదువులో, అటు ఉద్యోగాల సాధనలో దూసుకెళ్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారమని భావించగా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా చిట్కుల్ వంటి గ్రామాల్లో ఊరంతా వేడుక నిర్వహించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అమ్మాయిల ప్రాధాన్యం పెరిగింది. శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న పిల్లల దత్తత తీరు దీన్నే సూచిస్తోంది. ఆడపిల్లల దత్తతకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
సంతానం లేని దంపతులకు వరంగా : 2010లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మంజూరైన శిశుగృహను సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజన జరిగినా సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సంబంధించి ఇక్కడి నుంచి సేవలందించారు. ఈ తరుణంలో సంవత్సరం కిందట సిద్దిపేటలో సైతం కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. అనాథలు, సంరక్షకులు లేని బాలబాలికలు శిశుగృహలో ఉంటున్నారు. బాలల సంరక్షణ విభాగం దీన్ని పర్యవేక్షిస్తోంది. సంతానం లేని దంపతులకు దత్తత ప్రక్రియ వరంగా మారింది.
- దంపతులు ఎవరైనా దత్తత తీసుకోవాలని భావిస్తే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. దీనికి పలు నిబంధనలను నిర్దేశించింది.
- దత్తత తీసుకునే తల్లిదండ్రులు శారీరక దృఢత్వంతో, మానసిక జాగరూకతతో బిడ్డను తీర్చిదిద్దే ప్రేరణ ఉండాలి.
- భార్యాభర్తలిద్దరి అంగీకారం తప్పనిసరి.
- ప్రమాణాలు అన్ని నెరవేర్చాక ఒంటరి లేదంటే విడాకుల పొందిన వ్యక్తి కూడా దత్తత తీసుకోవచ్చు. ఒంటరిగా నివసించే మగవారికి ఆడపిల్లను దత్తత తీసుకునేందుకు అనర్హుడు.
- ఇంటి నుంచే దత్తతకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు www.cara.nic వెబ్‌సైట్‌లో సంప్రదించాలి. అర్హతను బట్టి అధికారులు ఎంపిక చేస్తారు.
చట్టబద్ధంగా దత్తత : పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోయిన వారు కొందరున్నా ఆదరణకు నోచక పొదల్లో పడేసిన వారు మరికొందరు. ఇలా ఎంతో మంది అనాథలుగా మారుతున్నారు. కొందరు తల్లిదండ్రులు పిల్లలను భారంగా భావిస్తున్నారు. చిన్నారులకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలన్న సంకల్పంతో సర్కార్ శిశుగృహ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులను ఆసక్తి ఉన్న వారికి చట్టబద్ధంగా దత్తత ఇస్తారు. నాలుగు సంవత్సరాల్లో ఆయా కేంద్రాల ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 45 మంది చిన్నారులను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం గమనార్హం. వీరిలో 35 మంది ఆడపిల్లలే కావడం విశేషం. ప్రస్తుతం సంగారెడ్డి, సిద్దిపేటలోని శిశుగృహాల్లో కలిపి 17 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు.
చట్టబద్ధంగా పిల్లల దత్తత ప్రక్రియ పూర్తిచేసుకోవాలని సంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారిణి లలిత కుమారి అన్నారు. శిశుగృహలో ఉంటున్న చిన్నారుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దత్తతకు వెళ్లిన చిన్నారుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్న ఆమె అర్హులకే పిల్లలను అప్పగించడం తమ ధ్యేయమని చెప్పారు. ఆసక్తి ఉన్న వారికి ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతోనే సలహా కేంద్రాన్ని ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.

