Additional Funds Released For Drinking Water: మంత్రి నారా లోకేశ్ ప్రాతినిథ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు అదనంగా నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ది పథకం కోసం అదనంగా మరో రూ. 111.50 కోట్ల నిధుల విడుదలకు పరిపాలన అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామాల్లో పైప్ లైన్లు, ట్యాంకుల నిర్మాణం : సురక్షిత తాగునీరు అందించే పథకం కోసం గతంలో 21 గ్రామాలకు కలిపి రూ. 450.24 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇప్పటికే యూఐడీఎఫ్ కింద రూ. 287.54 కోట్లు, అమృత్ 2.0 కింద రూ. 51.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇటీవల మరో 15 గ్రామాలను మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపారు. ఆయా గ్రామాల్లో పైప్ లైన్లు, ట్యాంకుల నిర్మాణం కోసం రూ. 111.50 కోట్లు నిధులు వెచ్చించనున్నారు.
కార్పొరేషన్లో అదనంగా కలిపిన గ్రామాల కోసం తాజాగా ఇచ్చిన నిధులను సీఆర్డీఎ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంజనీర్ ఇన్ చీఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ విభాగం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
బోర్ల నుంచి ఉప్పు నీరు - ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆ జిల్లాకు జలకళ - రూ.2,074 కోట్లతో 5 నియోజకవర్గాలకు తాగునీరు