ACB Raids on Irrigation Dept EE Residences : మరో అవి'నీటి'తిమింగలం అనిశా వలలో చిక్కింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఈఈ నూనె శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తుల గుర్తించారు. మార్కెట్‌లో వాటి విలువ రూ.150 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తనిఖీలు పూర్తయితే మొత్తం ఆస్తుల విలువ తెలిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పెళ్లికి విమానంలో బంధువుల తరలింపు : కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌కు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు తదితర 13 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్-ఈఈగా పనిచేస్తున్నప్పుడు కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఆ తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. వాటివిలువ మార్కెట్‌లో రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అమీర్‌పేట, తెల్లాపూర్, షేక్‌పేట్‌లతోపాటు, ఆయన పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఎస్సార్ఎస్పీ కార్యాలయం సిద్దిపేటలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమార్జనతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లని స్థాపించారని, కుమారుడి పెళ్లికి అతిథులను, విమానంలో థాయ్‌లాండ్‌కు తరలించిట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుగా నమోదు చేసిన అనిశా ఆయన్ని అరెస్టు చేసింది.
ఏసీబీ తనిఖీల్లో శ్రీధర్‌కు సంబంధించి కోట్ల విలువైన ఆస్తులు వెలుగుచూశాయి. తెల్లాపూర్‌లో విల్లా, షేక్‌పేట్‌లోని స్కైహైగేటెడ్ కమ్యూనిటీలో . 4,500 చదరపు అడుగుల ఫ్లాట్, అమీర్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, కరీంనగర్‌లో మూడుఫ్లాట్లు, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో ఒక్కోక్కటి చొప్పున మూడు భవనాలు, 16 ఎకరాల వ్యవసాయభూమి, 19 ఇళ్ల స్థలాలు, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లని అధికారులు గుర్తించారు. ఆ సోదాలు మరికొద్ది రోజులు కొనసాగనున్నాయి. లాకర్లని తెరవడం సహా బ్యాంకుఖాతాల్లోని లావాదేవీల వివరాలు రాబట్టనున్నారు. సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా మరికొన్ని ఆస్తులను గుర్తించే అవకాశముంది. ముఖ్యంగా శ్రీధర్‌కు బినామీగా వ్యవహరించిన వారిని గుర్తించనున్నారు.
హైదరాబాద్‌కు తరలింపు : కరీంనగర్ జిల్లా చొప్పదండి డివిజన్ ఈఈగా పనిచేస్తున్న శ్రీధర్ స్థానిక ఆర్టీసీ వర్క్‌షాప్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. హైదరాబాద్ నుంచి అనిశా అధికారుల బృందం కరీంనగర్‌కు చేరుకొని ఇంట్లో సోదాలు చేశారు. అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు. చొప్పదండిలోని నీటిపారుదలశాఖ కార్యాలయానికి వెళ్లిన మరో బృందం అక్కడ దస్త్రాలు పరిశీలించింది. కరీంనగర్‌లోని భాగ్యనగర్‌లో శ్రీధర్ అత్తగారింట్లోని భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కరీంనగర్ డీసీపీ రమణమూర్తి నేతృత్వంలోని సిబ్బంది తనిఖీలు చేసి పలు వివరాలు సేకరించింది. శ్రీధర్ భాగస్వామ్యం ఉన్న కరీంనగర్‌లోని ఓ హోటల్‌లోనూ తనిఖీలు చేశారు. హనుమకొండలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న శ్రీధర్ సోదరుడు యుగంధర్ ఇంట్లోనూ తనిఖీ చేశారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని అనిశా అధికారి సాంబయ్య వెల్లడించారు.
కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ ఇటీవలే ఏసీబీకి పట్టుపడ్డారు. ఇదే ప్రాజెక్టులోపనిచేసిన శ్రీధర్ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. నీటిపారుదల శాఖలో దాదాపు 30 ఏళ్లకుపైగా పనిచేసిన హరిరామ్ వద్ద అధికారిక లెక్కల ప్రకారం రూ.11 కోట్ల ఆస్తులు గుర్తించారు. అనధికారికంగా వాటి విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఉద్యోగంలోచేరిన శ్రీధర్ వద్ద అంతకంటే ఎక్కువ ఆస్తులు దొరకడం గమనార్హం. అమీర్‌పేటలోని వాణిజ్య సముదాయం, తెల్లాపూర్‌లో విల్లావిలువే రూ.40 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అవినీతి సొమ్ముతో వివిధ వ్యాపారాలు ప్రారంభించడం గమనార్హం. కరీంనగర్, సిద్దిపేటలో హోటల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం సహా కొంపల్లి సమీపంలో కన్వెన్షన్ సెంటర్లు నిర్మించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ స్థాయిలో ప్రభావం : కాళేశ్వరం ప్రాజెక్టులోని 6, 7, 8 ప్యాకేజీలు వాటి అనుబంధ పనులన్నీ శ్రీధర్ పర్యవేక్షణలోనే జరిగాయి. వాటన్నింటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.15 వేలకోట్లు వెచ్చించింది. శ్రీధర్‌పై ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు 9 నెలల క్రితమే ఆయన్ని పనిచేస్తున్న స్థానం నుంచి మారుస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆ ఉత్తర్వులు ఇప్పటివరకు ఆయనకు చేరకపోవడం గమనార్హం. ప్రభుత్వంలో శ్రీధర్‌కు పలుకుబడి అధికంగా ఉందని ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోగలిగే సామర్థ్యం ఆయన సొంతమని, అవసరమైతే వారిపై ప్రభుత్వ స్థాయిలో ప్రభావం చూపగలిగిన నేర్పు ఆయనకున్నట్లు పేరుంది.
పోలీస్ శాఖలో పెరుగుతున్న లంచావతారులు - ఈ ఏడాది ఏసీబీ కేసుల్లో వారే టాప్!
చెత్త డబ్బాలో అవినీతి సొమ్ము - డబ్బు తీసి లెక్కిస్తున్న ఎస్సైకి ఊహించని షాక్