ETV Bharat / state

ఖాళీ లారీలు తిప్పి - సిట్‌కి 'దృశ్యం' సినిమా చూపించిన నిందితులు

కల్తీ నెయ్యి కేసులో ఆశిష్‌ అగర్వాల్‌కు బెయిల్‌ తిరస్కరించిన ఏసీబీ కోర్టు - సిట్‌ తరపున వాదనలు వినిపించిన ఏపీపీ జయశేఖర్‌

Tirumala_adulterated_ghee_case
Tirumala_adulterated_ghee_case (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 28, 2025 at 3:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

ACB Court Rejects Bail for Ashish Agarwal: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో పాత్రధారిగా ఉన్న ఆశిష్‌ అగర్వాల్‌ (ఏ15) బెయిల్‌ పిటిషన్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టు రెండవ సారి కూడా తిరస్కరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తరపున ఏపీపీ జయశేఖర్‌ వాదనలు వినిపించారు. ప్రధాన సూత్రధారులైన భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌కు ఆశిష్‌ అగర్వాల్‌ సన్నిహితుడని తిరుమలతోపాటు శ్రీకాళహస్తి, విజయవాడ, శ్రీశైలం, తదితర ఆలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తోన్న విషయం ఆశీష్‌కు తెలిసినా కూడా వారికి సహకరించారని న్యాయమూర్తికి తెలిపారు.

తనకు చెందిన అగర్వాల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, సుప్రీం, సుప్రీం ఇంక్, అగర్వాల్‌ అండ్‌ అగర్వాల్‌ సన్స్‌ కంపెనీలతోపాటు మరికొన్ని కంపెనీల నుంచి రూ.146 కోట్లకు నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించాడని తెలిపారు. వీటి ఆధారంగా ఈ సంస్థల నుంచి తాము నెయ్యి కొనుగోలు చేశామని పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌ అధికారులను బురిడీ కొట్టించారని కోర్టుకు తెలిపారు.

సిట్‌కి 'దృశ్యం' సినిమా: ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బృందం ఏడాదికి 2 సార్లు తనిఖీలకు వచ్చినప్పుడు తప్పించుకునేందుకు ఈ ఇన్వాయిస్‌లు ఉపయోగపడ్డాయని ఏపీపీ జయశేఖర్‌ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీకి తమ కంపెనీల నుంచి నెయ్యి సరఫరా జరిగిందని రుజువు చేసేందుకు ఆశీష్‌ ఖాళీ లారీలను రాజస్థాన్‌లోని బీకానేర్, దిల్లీ నుంచి రూర్కీకి తిప్పించారని అన్నారు. ఒక రకంగా సిట్‌కి నిందితుడు 'దృశ్యం' సినిమా చూపించారని తెలిపారు.

కుట్ర బయటపడకుండా ఉండేందుకు ఆశిష్‌ అగర్వాల్‌ పకడ్బందీగా వ్యవహరించారని, సెల్‌ఫోన్‌ను కూడా ధ్వంసం చేశారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఇలాంటి వ్యక్తికి బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న ఏపీపీ జయశేఖర్‌ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేశారు. ఈ నెల 25న వాదనలు జరగ్గా తాజాగా శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

హవాలాలోనూ ఆరితేరిన నిందితుడు: నకిలీ ఇన్వాయిస్‌ల్లో పేరున్న కంపెనీలకు భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు ఆన్‌లైన్‌ ద్వారా నగదు పంపించే వారని తిరిగి ఈ డబ్బును హవాలా ద్వారా వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. ఆయా కంపెనీలతోపాటు ఆశిష్‌ అగర్వాల్‌కు 2- 3 శాతం కమీషన్‌ దక్కిందని ఈ మొత్తం వ్యవహారంలో ఏ15 కీలక పాత్రధారుడని ఏపీపీ స్పష్టం చేశారు.

శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కేసు - మరో ఇద్దరిని కస్టడీకి తీసుకున్న సిట్

ఆ దేవాలయాలకూ కల్తీ నెయ్యి - సిట్​ విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు